ఆశా వర్కర్లపై ప్రభుత్వ ప్రేరేపిత దమనకాండ దారుణం.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విఫలం అవ్వడమే కాకుండా ఏడాదికాలంగా తన వద్దనే పెట్టుకున్న హోంశాఖ విద్యాశాఖ పనితీరు విషయంలో రేవంత్ రెడ్డి ఘోరంగా వైఫల్యం చెందారని తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్ తీవ్రంగా విమర్శించారు.ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వేతనాల పెంపు విషయమై ఉన్నతాధికారులకు విన్నవించుకోవడానికి రాజధానికి తరలివచ్చిన ఆశా వర్కర్లపై పోలీసులతో దారుణంగా దాడి చేయించడం, పలువురు ఆశా వర్కర్లు తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలు కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరిన నాటినుండి అధికార, పోలీసు యంత్రాంగాలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాయని.. రైతులు, విద్యార్థులు, మహిళలని కూడా చూడకుండా భౌతిక దాడులు చేస్తుండం కాంగ్రెస్ వల్లెవేసే ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని అన్నారు.గురుకుల పాఠశాలు, ఇతర ప్రభుత్వ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో తరచుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి.
పదుల సంఖ్యలో చిన్నారుల మరణం, వందలాది మంది విద్యార్థులు ఆస్పత్రులపాలు కావడం ముమ్మాటికీ రేవంత్ రెడ్డి చేతగాని పనితీరుకు నిదర్శనమని అన్నారు.దేశంలో అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఇంత దుర్మార్గంగా, మూర్ఖంగా వ్యవహరిస్తూ అభాసుపాలైన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు ఏడాదిగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరులను జాగ్రత్తగా గమనిస్తున్నారని సరైన సమయంలో కీలెరిగి వాత పెట్టడం ఖాయమని రాజా వరప్రసాద్ స్పష్టం చేశారు.