మూసీ ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్ పరిధిలోని మూసీ ఆక్రమణలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిషోర్ తెలిపారు.
ఇదే విషయమైన బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ సుందరీకరణలో భాగంగా మూసీలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన దాదాపు 1,600 నిర్మాణాలను సర్వే ద్వారా గుర్తించినట్లు తెలిపారు. ఈ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
అయితే, ఇందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక కార్యాచరణను రూపొందించినట్లు దాన కిషోర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసి పునరావాసం కల్పిస్తామని ప్రకటించారు.
దాదాపు 15 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్‌లో నివసిస్తున్న కుటుంబాల పునరావాసానికై రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని దాన కిషోర్ తెలిపారు. రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి పునరావాస కార్యాచరణకై సంబంధిత జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించి పునరావసం కల్పించిన తర్వాతనే ఈ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం ప్రారంభమవుతోందన్నారు.