టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు
తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ (Yadagirigutta Temple) బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. అచ్చంగా టీటీడీ అనుసరించిన తరహాలోనే బోర్డుకు స్వయం ప్రతిపత్తి, విధి విధానాలు ఉండేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ రాజ గోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించాలని ఆదేశించారు.
స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (#SPEED) ప్రాజెక్టుల్లో భాగంగా దేవాలయాల అభివృద్ధిపై డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు.
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు చాలావరకు అర్థంతరంగా నిలిచిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ అలా ఆగిపోవడానికి వీల్లేదని, ఇప్పటివరకు ఏమేం అభివృద్ధి పనులు జరిగాయి. ఇంకా ఏమేం అసంపూర్తిగా ఉన్నాయనే వివరాలతో వారం రోజుల్లో సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించారు.
ప్రస్తుతం కీసర గుట్టపై ఉన్న రామలింగేశ్వర ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రతిరూపంగా, అచ్చం అదే నమూనాతో కీసరగుట్ట ఆలయాన్ని నిర్మించాలని చెప్పారు. ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీతో రామప్ప ఆలయ ఆకృతిలో యథాతథంగా కీసర ఆలయం పునర్మిర్మాణం చేపట్టాలని సూచించారు.