పోస్టు పెడితే అరెస్టు చేసుడేంది?-ఎడిటోరియల్ కాలమ్
సమాచార మాధ్యమాల ద్వారా నచ్చిన అంశంపై మాట్లాడే భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న ఐటీ చట్టం-2000లోని సెక్షన్-66(ఏ)ను సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం చాపచుట్టి పక్కనబెట్టింది. ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్ వంటి సోషల్‌మీడియా వేదికల్లో, వెబ్‌సైట్లలో అభ్యంతరకర పోస్టులు చేశారన్న నెపంతో వ్యక్తులను ఏకపక్షంగా అరెస్టు చేయడానికి వీలు కల్పించే సైబర్ చట్టంలోని అంశాలను న్యాయస్థానం నిర్దంద్వంగా తోసిపుచ్చింది. ఈ మేరకు 2015 మార్చి 24న జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం 123 పేజీల చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కాగా, తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, బీఆర్‌ఎస్ నాయకుడు కొణతం దిలీప్ అరెస్టు నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారింది.తీర్పు సందర్భంగా ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్యలు ఇవి..!
- వాక్ స్వాతంత్య్రం అనేది దేశంలోని పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు.
- నేటి యుగంలో సమాచార మాధ్యమాల ద్వారానే కోట్లాది పౌరులు తమ అభిప్రాయాలను పంచుకొంటున్నారు. ఇందుకు సోషల్‌మీడియా వేదికలు, వెబ్‌సైట్లు, ఈ-మెయిల్‌లను వాడుతున్నారు.
- పౌరుల ఆలోచనా స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ అనే హక్కులకు ఐటీ చట్టంలోని సెక్షన్ 66(ఏ) ఒకవిధంగా అడ్డంకిగా మారింది.
- రాజ్యాంగం ప్రసాదించిన వాక్‌స్వాతంత్య్రం అనే ప్రాథమిక హక్కుకు ఈ సెక్షన్ ప్రత్యక్షంగానే భంగం కలిగిస్తున్నది.
- తీవ్ర ప్రమాదకర వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు నమోదు చేయవచ్చని ఐటీ చట్టంలోని సెక్షన్ 66(ఏ) చెప్తున్నది.
- మా ప్రశ్నేంటంటే, ఒక వ్యక్తి చేసి న వ్యా ఖ్యలు తీవ్ర ప్రమాదకరమైనవా? లేదా అభ్యంతరకరమైనవా? లేదా దురుద్దేశపూరితమైనవా? ఎవరు నిర్ణయించాలి?
- సోషల్‌మీడియాలో వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తి తప్పు చేశాడని పోలీసులే ముందుగా ఎలా నిర్ణయిస్తారు. అంటే వాళ్లకు వాళ్లే తీర్పునిస్తారా? కేసులు పెట్టేస్తారా?
- సోషల్‌మీడియాలో చేసిన పోస్టులను బట్టి అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు. మనసుకు నచ్చిన అభిప్రాయాలను వెల్లడించే హక్కు ను ఇది కాలరాయడమే.
- సెక్షన్ 66(ఏ)లోనే రెచ్చగొట్టే, ఇబ్బందిపెట్టే, తీవ్ర ప్రమాదకరమైన.. అంటూ పలు పదబంధాలున్నాయి. ఏ కామెంట్ ను ఏ క్యాటగిరీలోకి నిర్ణయిస్తారు?
- ఒక వ్యక్తి చేసిన కామెంట్ ఎలాంటి నేరం కిందకు వస్తుందో అటు పోలీసులు, ఇటు పోస్టు చేసిన వారూ గుర్తించడం కష్టం. అలాంటప్పుడు.. ఆ వ్యక్తిపై పోలీసులు కేసు ఎలా పెడతారు?
- సుశిక్షితులైన న్యాయకోవిదులు కూడా ఒకే అంశంపై భిన్నమైన తీర్పులు ఇవ్వడాన్ని చూస్తుంటాం. అలాంటిది ఏది నేరమో.. ఏది తీవ్ర నేరమో.. ఏది కాదో.. ఇతరులు (పోలీసులు) ఎలా నిర్ణయించగలరు?
- ఒక వ్యాఖ్య ప్రమాదకరమా? అత్యంత ప్రమాదకరమా? అనే దానిపై న్యాయకోవిదులు మాత్రమే నిర్ధారణకు రాగలరు.
- ఇంటర్నెట్‌లో, సోషల్‌మీడియాలో చేసిన వ్యాఖ్యలను శాంతిభద్రతలతో ముడిపెట్టడం తగదు.
- సోషల్‌మీడియాలో చేసిన కామెంట్లతో పరువు నష్టానికి పాల్పడ్డారని, నేరం చేసేలా ప్రేరేపించారనేందుకు గానీ అవసరమైన అంశాలేవీ సెక్షన్ 66(ఏ)లో లేవు.
- లిఖితపూర్వక వ్యాఖ్యలు, సోషల్‌మీడియాలో కామెంట్లు ఒక దృక్కోణంతో వ్యక్తంచేసే అభిప్రాయాలే. ఈ వ్యాఖ్యలను బట్టి నేరం చేశారంటూ కేసులు నమోదుచేయడం సహేతుకం కాదు.
- (సెక్షన్ 66(ఏ)ను దుర్వినియోగం చేయబోమన్న అప్పటి ఎన్డీయే సర్కారును ఉద్దేశిస్తూ..) ‘ప్రభుత్వాలు మారుతాయి. చట్టం మాత్రం శాశ్వతం. రాబోయే ప్రభుత్వం ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేయబోదని వారి తరఫున మీరెలా (కేంద్రం) పూచీ పడతారు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ క్రమంలో సెక్షన్ 66(ఏ)ను కొట్టేస్తున్నట్టు ప్రకటించింది.
ఏమిటీ కేసు?
శివసేన అగ్రనేత బాల్‌ఠాక్రే మృతికి నిరసనగా 19 నవంబర్ 2012లో ముంబైలో బంద్ పాటించారు. దీనిని షహీన్ బాహ్దా అనే యువతి సోషల్‌మీడియాలో ప్రశ్నించింది. ఈ కామెంట్‌కు రీణు శ్రీనివాసన్ అనే మరో యువతి లైక్ కొట్టింది. దీంతో థానే పోలీసులు ఈ ఇద్దరినీ అరెస్టు చేశారు. వీళ్ల అరెస్ట్‌ను సవాల్ చేస్తూ శ్రేయా సింఘాల్ అనే లా విద్యార్థిని పిల్ దాఖలు చేశారు. ఎస్పీ నేత అజంఖాన్‌పై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన వ్యాక్యలు చేసిందంటూ ఓ విద్యార్థినిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతుండటంతో చివరకు సుప్రీంకోర్టు ఐటీ చట్టంలోని సెక్షన్-66(ఏ)ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
ఆగని అరెస్టులు
ఐటీ చట్టంలోని సెక్షన్ 66(ఏ)ను సుప్రీంకోర్టు రద్దు చేసినప్పటికీ, నెటిజన్లపై కేసుల నమోదు మాత్రం ఆగలేదు. దీంతో ఈ విషయంపై 2021లో సుప్రీంకోర్టు మరోమారు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘ఇక మీదట రాష్ర్టాలు, యూటీల్లో ఏ పోలీసు స్టేషన్‌లోనూ సెక్షన్ 66(ఏ) కింద కేసులు నమోదు చేయవద్దు’ అంటూ కేంద్రహోంశాఖ వెంటనే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెక్షన్ కింద నమోదు చేసిన కేసులనూ ఉపసంహరించాలని ఆదేశించింది.
ఏమిటీ సెక్షన్ 66(ఏ)
దురుద్దేశంతో ఇతరులకు హాని కలిగించేలా అభ్యంతరకరంగా, అసౌకర్యం కలిగించేలా నెట్టింట వ్యాఖ్యలు చేయడం లేదా సమాచారాన్ని చేరవేయడాన్ని నేరంగా పరిగణిస్తారని ఐటీ చట్టంలోని సెక్షన్ 66(ఏ) చెప్తున్నది. దీనికి గరిష్ఠంగా మూడేండ్ల జైలు శిక్ష విధించవచ్చని పేర్కొన్నది. అయితే, ఈ సెక్షన్‌ను సుప్రీంకోర్టు తప్పుబడుతూ రద్దు చేసింది. ఈ సెక్షన్ భావప్రకటనను హరించడమేనని తేల్చిచెప్పింది.
తప్పో.. ఒప్పో పోలీసులెలా నిర్ణయిస్తారు?
ఒకరికి తప్పుగా కనిపించిన విషయం.. మరొకరికి తప్పుగా కనిపించకపోవచ్చు. ఇలాంటి సమయంలో సోషల్‌మీడియాలో కామెంట్ చేశాడని ఒక వ్యక్తిపై కేసు ఎలా నమోదు చేస్తారు. ఒక విషయం తప్పా? ఒప్పా? అనేది పోలీసులు ఎలా నిర్ణయించగలరు? మనసుకు నచ్చింది కూడా చెప్పే హక్కు కూడా పౌరులకు ఉండకూడదా? ఐటీ చట్టంలోని సెక్షన్-66(ఏ) భావప్రకటన స్వేచ్ఛను హరించేలా ఉన్నది. అందుకే దానిని తోసిపుచ్చుతున్నాం.
– జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ నారీమన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం (24.03.2015)