ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచుతాం..

 ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచుతాం..

Revanth Reddy Anumula

Loading

తెలంగాణలో షెడ్యూల్డు కులాల రిజర్వేషన్లను 15 నుంచి 18 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రిజర్వేషన్లను పెంచడానికి సహేతుకమైన విధానం పాటించాల్సి ఉన్నందున 2026 జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత ఆ జనాభా నిష్పత్తి మేరకు ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 18 శాతానికి పెంచడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు.మంత్రి దామోదర రాజనర్సింహ గారు శాసనసభలో ప్రవేశపెట్టిన ‘షెడ్యూల్డు కులాల రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్’ బిల్లుపై ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. రిజర్వేషన్లను పెంచడంతో పాటు దామాషా ప్రకారం గ్రూపు 1, 2, 3 కేటగిరీల వర్గీకరణ బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

“ప్రస్తుత రిజర్వేషన్లను పెంచాలంటే సహేతుకమైన విధానం పాటించాల్సి ఉంటుంది. 2011 జనాభా లెక్కలు మాత్రమే అధికారికంగా అందుబాటులో ఉన్నాయి. చట్టపరంగా ఎలాంటి చిక్కులు ఎదురుకాకుండా రిజర్వేషన్లు పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం కనుక 2026 జనాభా లెక్కలు చేపడితే ఆ జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడానికి వీలవుతుంది” అని వివరించారు .షెడ్యూల్డు కులాలకు మరింత ప్రయోజనం చేకూర్చే విషయంలో ప్రభుత్వం పారదర్శకమైన కార్యాచరణ చేపడుతుందని, ఇలాంటి విషయాల్లో భేషజాలు లేకుండా అందరినీ సంప్రదించి వారి అభిప్రాయాల మేరకు ముందుకు వెళుతామని వివరించారు.

షెడ్యూల్డు ఉప కులాల వర్గీకరణ బిల్లు కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియకు శాసనసభ పార్టీలు రాజకీయాలకు అతీతంగా పూర్తి స్థాయిలో మద్దతు పలికినందుకు సభ్యులందరికీ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వర్గీకరణ సమస్యకు శాసనసభ శాశ్వతమైన పరిష్కారం చూపించడం ఒక చారిత్రాత్మకమైన సందర్భంగా అభివర్ణించారు. వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. కృష్ణమాదిగ గారితో పాటు చాలా మంది 30, 35 ఏండ్లపాటు జరిగిన వర్గీకరణ పోరాటంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లలో ప్రాధాన్యత ఇవ్వడం, ఆ కుటుంబాల్లో విద్యావంతులుంటే రాజీవ్ యువ వికాసం పథకం కింద చేయూతనందిస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు.

ఎస్సీల్లో రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ జరగాలని 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కాలంలో శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించడం, ఆ తర్వాత జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ నియామకం, ఆ కమిషన్ నివేదిక, తదుపరి అంశం సుప్రీంకోర్టుకు చేరడం వంటి ఎస్సీ వర్గీకరణ అంశంలో చోటుచేసుకున్న సంఘటనల పరిణామ క్రమాన్ని ముఖ్యమంత్రి వివరించారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ఎస్సీ శాసనసభ్యులందరూ ఒక కమిటీగా ఢిల్లీ వెళ్లి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తమ వాదనను బలంగా వినిపించడం, సుప్రీంకోర్టు తీర్పు వెలువడటం, ఆ వెంటనే వంద శాతం అమలు చేస్తామంటూ శాసనసభలో ప్రకటన చేసిన పరిణామాలను వివరించారు.

సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో దామోదర రాజనర్సింహ , శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్ , ధనసరి అనసూయ సీతక్క , లోక్ సభ సభ్యుడు డాక్టర్ మల్లు రవి తో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు, ఆ ఉపసంఘం సూచన మేరకు జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ నియమాకం, కమిషన్ పనిచేసిన విధానం, నివేదిక వంటి అంశాలన్నీ ముఖ్యమంత్రి సభలో వివరించారు. కమిషన్ 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించడం, సామాజిక, విద్య, ఆర్థిక పరంగా పూర్తిగా వెనుకబడిన వర్గాలను గ్రూప్ 1 కింద 15 ఉపకులాలను పరిగణలోకి తీసుకుని వారికి 1 శాతం రిజర్వేషన్, మధ్యస్థంగా లబ్దిపొందిన కులాలను గ్రూపు 2 కింద 18 ఉపకులాలను పరిగణలోకి తీసుకుని వారికి 9 శాతం రిజర్వేషన్, గణనీయంగా ప్రయోజనం పొందిన కులాలను గ్రూపు 3 కింద పరిగణిస్తూ వారికి 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని సిఫారసు చేసిన అంశాలను తెలియజేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *