టీడీపీ నేతతో భేటీపై విజయసాయి రెడ్డి క్లారిటీ..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఇటీవల వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి అధికార టీడీపీకి చెందిన సీనియర్ నేత టీడీ జనార్ధన్ రెడ్డి నివాసానికెళ్లి మరి ఆయన్ని కలిశారని వైసీపీ పార్టీ ఎక్స్ వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది.
” లిక్కర్ స్కామ్ కేసులో సీఐడీ విచారణకు హజరు కావడానికి ముందు తాడేపల్లి పార్క్ విల్లాలో దాదాపు నలబై ఐదు నిమిషాల పాటు టీడీ జనార్ధన్ రెడ్డితో మంతనాలు జరిపారు. ఆ తర్వాతనే మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై వీఎస్ఆర్ విమర్శలు చేశారు.
జగన్ నమ్మి రాజ్యసభకు పంపితే చంద్రబాబు నాయుడుకి మేలు చేసేందుకు ఆయన తన పదవీకి రాజీనామా చేశారని” వైసీపీ ఆరోపించింది. దీనిపై ఎక్స్ వేదికగా వీఎస్ఆర్ స్పందిస్తూ ” నేను ఆది శేషగిరిరావు ఇంటికి వెళ్లాను. అక్కడికి జనార్ధన్ రెడ్డి వస్తారని నాకు అసలు తెలియదు.
మా మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. నేను టీడీపీలో చేరటం లేదని ఇప్పటికే చెప్పాను. కలవాలనుకుంటే బహిరంగంగానే సీబీఎన్ , లోకేశ్ లను కలిసేవాడ్ని. వారు ఇప్పుడు నా రాజకీయ ప్రత్యర్థులు కాదు. ఎందుకంటే నేనిప్పుడు రాజకీయాల్లో లేను” అని పేర్కొన్నారు.