ములుగు ఘటన రిపీట్ కాకుండా చూడాలి..!

The Mulugu incident must be prevented from being repeated..!
ఇటీవల ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనాల తో తీవ్రంగా నష్టపోయిన గిరిజన రైతుల సంఘటన నేపథ్యంలో తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ ను కలిసిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు భవానీ రెడ్డి, భూమి సునీల్, వ్యవసాయ శాస్త్రవేత్త రామాంజనేయులు.. ప్రతిపాదన లేఖను అందించారు.
ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో మొక్కజొన్న విత్తన సాగుచేస్తున్న రైతులు తీవ్ర కష్టనష్టాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే రైతు కమిషన్ నిజనిర్ధారణ కమిటీ వేసి క్షేత్ర స్థాయిలో పర్యటించి, జరిగిన నష్టాన్ని అంచనా వేసి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే నష్టపోయిన రైతులకు తగు నష్టపరిహారం చెల్లించే చర్యలను జిల్లా యాంత్రాంగం చేపట్టింది.
ములుగులో జరిగిన సంఘటన విత్తన, మార్కెట్ చట్టాల లోపాలను ఎత్తిచూపుతున్నాయని కమిషన్ తన లేఖ ద్వారా స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. గత ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ల చట్టాలకు చేసిన కొన్ని సవరణలు.. రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు విత్తన చట్టం లో తేవాల్సిన మార్పులపై వ్యవసాయ కమిషన్ పలు సూచనలు చేస్తూ.. చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారికి నివేదిక అందించింది.
- వ్యవసాయ మార్కెట్ల చట్టంలోని కాంట్రక్టు వ్యవసాయానికి సంబందించిన సెక్షన్ 11ఏ లో గత బిఆర్ఎస్ ప్రభుత్వం మార్పు చేసి, కంపెనీలకు ఎలాంటి బాధ్యత లేకుండా ఆర్గనైజర్ల వ్యవస్థను తీసుకొచ్చింది.
ఇప్పుడు ఈ సెక్షన్ ను సవరించి 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను కొనసాగించాలని సూచించింది. - కేంద్రం చేసిన విత్తన చట్టంలో నకిలీ విత్తనాల తయారీ, అమ్మకాలు చేసే కంపెనీ లపై చర్యలు తీసుకోడానికి కఠిన తరమైన నిబంధనలు లేవు.
- మహారాష్ట్ర చేసినట్లుగా విత్తన చట్టం సవరించి నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది
- రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న వ్యవసాయ శాఖ పేరును వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ గా మార్చాలని కమిషన్ సూచన చేసింది.
