తెలంగాణలో మిల్లర్ల కతలు… రైతుల వెతలు..!

Farmer Problems
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్ళు మరి తక్కువయ్యాయి. ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసేందుకు రైస్ మిల్లర్లు అనాసక్తిని చూపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఇరవై తొమ్మిదో తారీఖున ప్రకటించిన ఖరీఫ్ ధాన్యం సేకరణ పాలసీ తమకు నష్టాలను చూపిస్తుందని మిల్లర్ల అసోషియేషన్ చెబుతుంది.
కొనుగోలు కేంద్రాల నుండి వస్తున్న ధాన్యాన్ని తీసుకోవడానికి మిల్లర్లు ఆసక్తి చూపకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ళు పడిపోయాయి. ప్రభుత్వం విధించిన 67కిలోల ఔటర్న్ బ్యాంకు గ్యారంటీ షరతులతో మిల్లర్లు కొనడానికి ముందుకు రావడం లేదు. అక్టోబర్ ఒకటో తారీఖు నుండే కొనుగోళ్ళు ప్రారంభం అని ఎంతో హట్టహాసంగా ప్రభుత్వం చెబుతున్న ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోళ్ళు చేసిన ధాన్యం కేవలం ఇరవై వేల టన్నుల మాత్రమే.
ఈ ఖరీఫ్ ధాన్యం కొనుగోలు లక్ష్యం ఎనబై లక్షల టన్నులు. ఇందులో ఒక్క శాతం కూడా కొనుగోలు చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం పేరుకుపోయింది. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో తడిసిపోతున్న ధాన్యాన్ని చూసి రైతులు కన్నీళ్ళు పెడుతున్నారు. పండించిన పంటకు సరైన ధర రాక.. కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో తక్కువ ధరకే ధాన్యం అమ్ముకుంటున్నారు.
