సినారే తెలుగు జాతికి గర్వకారణం
తెలంగాణ వారైనప్పటికీ కవీంద్రుడు స్వర్గీయ డాక్టర్ సి.నారాయణరెడ్డి గారు యావత్ తెలుగు జాతికి గర్వకారణంగా నిలుస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.తెలుగు సాహితీ లోకానికి సినారె గారు చేసిన సేవలు కలకాలం గుర్తుండిపోయేలా ఒక విద్యా సంస్థకు వారి పేరు పెడతామని, కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.
డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి 93వ జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో సీఎం పాల్గొన్నారు.శ్రీమతి సుశీల నారాయణరెడ్డి ట్రస్టు వారు సినారె గారి పేరు మీద నెలకొల్పిన “విశ్వంభర డాక్టర్ సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారాన్ని” ప్రముఖ తమిళ రచయిత్రి శివశంకరి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సినారె గారు రచించిన “సమన్వితం” పుస్తకాన్ని కూడా సీఎం గారు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారు, మాజీ ఎంపీ మురళీ మోహన్ గారు, సినారె గారి కుటుంబీకులు, పలువురు సాహితీవేత్తలు, సినారె అభిమానులు పాల్గొన్నారు.