సీఎం ఏక్‌నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర సీఎం పదవి రేసులో తాను లేనని, అయితే సీఎం పదవి తనకు రావడం ఖాయమని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఓ జాతీయ మీడియా సంస్థతో ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను తప్పకుండా సీఎం అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్‌ను కూడా తీవ్రంగా విమర్శించారు.
కాంగ్రెస్‌ది విభజించు పాలించు విధానమన్నారు. తన పార్టీని ఎప్పటికీ కాంగ్రెస్‌లోకి మార్చనివ్వనని బాలాసాహెబ్ ఠాక్రే చెబుతుండేవారని గుర్తుచేశారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే మాత్రం తన స్వార్థం కోసం, ముఖ్యమంత్రి కుర్చీ కోసమే కాంగ్రెస్‌తో చేతులు కలిపారని మండిపడ్డారు. ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని వెన్నుపోటు పొడిచారన్నారు. కాగా.. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరుగనుంది.
నవంబర్ 23న ఫలితాలను వెల్లడిస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 145 సీట్లు (మ్యాజిక్ ఫిగర్) అవసరం. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి, మహావికాస్ అఘాడి కూటముల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. మహాయుతిలో బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్), శివసేన (ఏక్‌నాథ్ షిండే), మన్సే, ఆర్‌పీఐ సహా 8 పార్టీలు ఉండగా.. మహావికాస్ అఘాడిలో కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) సహా పలు పార్టీలు ఉన్నాయి