వరంగల్ -హైదరాబాద్ మధ్య పుష్ – పుల్ రైలును నడపండి..!

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌ను శుక్రవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పుష్ – పుల్ రైలును వరంగల్ నుండి హైదరాబాద్ వరకు నడపాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కోరారు. వరంగల్ నుండి నిత్యం వేలాది మంది ప్రయాణికులు – విద్యార్థులు, ఉద్యోగులు, రోజువారీ కూలీలు, కార్మికులు వారి ప్రయాణ అవసరాల కోసం రైలు సేవలపై ఆధారపడుతున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం వరంగల్ నుండి హైదరాబాద్ మార్గంలో నడిచే చాలా ఎక్స్‌ప్రెస్ మరియు ప్యాసింజర్ రైళ్లలో సాధారణ కంపార్ట్‌మెంట్లు కిక్కిరిసి ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. చాలా మంది ప్రయాణికులు రిజర్వ్ చేసిన టిక్కెట్లను కొనుగోలు చేయడం లేదా ఆర్టీసీ బస్సులపై ఆధారపడడంతో ముఖ్యంగా బలహీన వర్గాల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు.
వరంగల్ మరియు హైదరాబాద్ మధ్య పుష్-పుల్ లోకల్ రైలు సర్వీసును తక్షణమే ప్రారంభించడంతో పాటు ప్రయాణికుల సౌకర్యం కొరకు బోగీల సంఖ్యను పెంచాలని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అభ్యర్థించారు. మరియు కాజీపేట లోకో రన్నింగ్ డిపో ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, ప్రస్తుతం కాజీపేటలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు.
