మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణంపై సమీక్ష..!
మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి..
వరద ముంపునుంచి ఖమ్మం ప్రజలకు శాశ్వతంగా విముక్తి కల్పించేందుకు గాను చేపట్టిన మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మంగళవారం నాడు సచివాలయంలో రిటైనింగ్ వాల్ పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇఎన్‌సీ అనిల్ కుమార్ తదతరులు పాల్గోన్నారు.
ఈసమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ మున్నేరు ముంపు నుంచి ఖమ్మం పట్టణాన్ని కాపాడేందుకు నదికి ఇరువైపులా ఆర్ సిసి కాంక్రీట్ గోడలు నిర్మిస్తున్నామని, ఖమ్మం నగరంలో ముంపునకు అవకాశం లేకుండా సరైన మార్గంలో వరద ప్రవాహాన్ని నడిపించేందుకు సరైన డిజైన్ తో వాల్ నిర్మించాలని అధికారులకు సూచించారు. వాల్ నిర్మాణపనులు మరింత వేగం పెరగాలని , నెలలో రెండు సార్లు స్వయంగా తానే పర్యవేక్షిస్తానని అన్నారు.
ఈ వాల్ నిర్మాణానికి అవసరమయ్యే భూ సేకరణను చేపట్టాలని ఇందుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ఖమ్మం జిల్లాలోని అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. వాల్ నిర్మాణానికి ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. 1969 నుంచి 2024 సెప్టెంబర్ వరకు వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకొని వాల్ నిర్మించాలని అన్నారు. ఇటు ఖమ్మం అటు పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు సౌకర్యం కల్పించేలా సుమారు 23 కిలోమీటర్ల మేర వాల్ నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు.