యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి..!

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొని గోపురాన్ని స్వామివారికి అంకితం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం వేదపండితులు నిర్ణయించిన సుమూర్తాన మహా కుంభాభిషేక సంప్రోక్షణ జరిగింది.
వానమామలై మఠం పీఠాధిపతులు రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పూజాది కార్యక్రమాల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు.
అంగరంగ వైభవంగా సాగిన ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ,శాసనసభ్యులు బీర్ల ఐలయ్య , కుంభం అనిల్ కుమార్ రెడ్డి , ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
