వివాదంలో సీతారామ ప్రాజెక్టు
సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పరిపాలనా అనుమతుల్లేకుండానే సుమారు రూ. 1,074 కోట్ల అంచనా వ్యయంతో డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం ఇతర పనులకు ప్రాజెక్టు అధికారులు టెండర్లను ఆహ్వా నించడం నీటిపారుదల శాఖలో వివాదస్పదంగా మారింది.
సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 మధ్య ఏడు పనులకు రూ. 1,842 కోట్ల అంచనాతో నీటిపారుదల శాఖ టెండర్లను ఆహ్వానించింది. అయితే వాటిలో సుమారు రూ.768 కోట్లు విలువ చేసే పనులకే ఆర్థిక శాఖ ఆమోదం తెలపగా ఆ మేరకు నీటిపారుదల శాఖ పరిపాలనా అనుమతులు జారీ చేసింది.
మిగిలిన రూ.1,074 కోట్ల పనులకు ఆమోదం తెలపడంపై నిర్ణయాన్ని ఆర్థిక శాఖ పెండింగ్ ఉంచింది. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులకు ప్రాజెక్టు అధికారులు టెండర్లను ఆహ్వానించారు.
గతంలో మంత్రులు నిర్వహించిన ఓ సమీక్షలో వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించగా.. ప్రాజెక్టు అధికారులు అనుమతులు పొందకుండానే తొందరపాటుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది.
ప్రభుత్వం సత్వరమే టెండర్లు పిలవాలని ఆదేశిస్తే దానర్థం అనుమతుల్లేకుండానే టెండర్లు ఆహ్వానించాలని కాదని, అనుమతులన్నీ తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత ఆధికారులదేనని ఉన్నతాధికారులు అంటున్నారు.