Cancel Preloader

హైదరాబాద్ తరహాలో ఖమ్మం కు ఓఆర్ఆర్..!

 హైదరాబాద్ తరహాలో ఖమ్మం కు ఓఆర్ఆర్..!

ORR to Khammam like Hyderabad..!

తెలంగాణ ఏపీ మధ్య వారధిగా ఉన్న ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వైద్య, విద్యా రంగంలో మోడల్‌గా నిర్మాణం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 500 ఎకరాల్లో ఉన్న వెలుగుమట్ల అర్బన్ పార్క్‌ను ఏకో పార్క్‌లా అభివృద్ధి చేసి ఖమ్మం ప్రజలకు అందిస్తామని అన్నారు. చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఖమ్మం ఖిల్లాపై రోప్ వే తో పాటు పట్టణ కేంద్రంలో ఉన్న లకారం ట్యాంక్ బండ్ వద్ద శిల్పారామం ఏర్పాటు ప్రతిపాదన ఉందని మంత్రి తుమ్మల చెప్పారు. మున్నేరు వరద గండం లేకుండా రూ.700 కోట్లతో మున్నేరుకు ఇరువైపులా కాంక్రీట్ వాల్స్ నిర్మాణం చేస్తామని తెలిపారు.

రూ.220 కోట్లతో ఫ్లడ్ వాటర్ మళ్లింపు కోసం డ్రైనేజ్ నిర్మాణం చేపట్టామన్నారు. రఘునాథపాలెం దశాబ్దాల సాగు నీటి కలను సాకారం చేస్తూ సాగర్ కెనాల్‌పై లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి రోజున మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు శంకుస్థాపన చేస్తామని అన్నారు. ఖమ్మం నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తన పదవి కాలంలోనే పూర్తి చేయాలనేది తన కోరిక అని ఉద్ఘాటించారు. ప్రకాశ్ నగర్ మున్నేరు హై లెవల్ బ్రిడ్జి మరమ్మత్తు పనులు రెండు నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. నిజాం కాలం నాటి కాల్వ ఒడ్డు బ్రిడ్జి వద్ద కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టామని అన్నారు. ఖమ్మం నగరానికి కేబుల్ బ్రిడ్జి ఐకానిక్‌గా మారుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

ఖమ్మం నగరం చుట్టూ నేషనల్ హైవే‌లతో రింగ్ రోడ్ నిర్మాణానికి వెసులుబాటు కల్పిస్తామని అన్నారు. హైదరాబాద్ ఓ.అర్.ఆర్ మాదిరిగా ఖమ్మానికి రింగ్ రోడ్ నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించారు. ట్రాఫిక్ ఫ్రీ నగరంగా ఖమ్మం మారుతుందని అన్నారు. తన చిరకాల కోరిక గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడమని ఉధ్ఘాటించారు. వచ్చే ఆగస్ట్ 15వ తేదీ నాటికి యాతాల కుంట టన్నెల్ ద్వారా సత్తుపల్లి, అశ్వారావుపేటకు సాగునీరు అందిస్తామని తెలిపారు. జూలూరుపాడు టన్నెల్ పూర్తయితే పాలేరు వరకు గోదావరి నీళ్లు వస్తాయని తెలిపారు.

సీతమ్మ సాగర్ పూర్తయితే పోలవరం టూ సీతమ్మ సాగర్ అక్కడ నుంచి సమ్మక్క సాగర్ ఆ తర్వాత మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజ్ వరకు నౌకాయానం ప్రతిపాదన ఉందని అన్నారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రికి రైల్వే‌లైన్ ఏర్పాటుతో భక్తులకు, పర్యాటకులకు ఎంతో సౌకర్యం ఉంటుందని తెలిపారు. కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నామన్నారు. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుపై నిపుణులు నివేదిక తయారు చేస్తున్నారని చెప్పారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *