సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు షాక్..!

CM Revanth Reddy
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒకటి కాదు రెండు కాదు పదిహేను నెలలవుతుంది. ఇంతవరకూ ముఖ్యమంత్రి మంత్రుల మధ్య.. మంత్రులు ఎమ్మెల్యేల మధ్య సయోధ్య కుదరడం లేదా..?. జాతీయ పార్టీ అంటేనే వర్గాలు అనే ముద్రను ఇంకా నిజం చేస్తున్నారా.. ? . లేదా వీరివురి మధ్య సమన్వయం లోపించిందా అంటే.. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మంత్రులు.. సీఎం.. అధికార పార్టీ సభ్యుల తీరును చూస్తుంటే అవుననే అన్పిస్తుంది.
ఇటీవల స్టేషన్ ఘన్ పూర్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” పదేండ్ల పాలనలో కేసీఆర్ పది లక్షల కోట్ల అప్పులు చేశారు. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టారు. అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రోజు మండలిలో గవర్నర్ ప్రసంగం పై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ఎమ్మెల్సీ ప్రొ. కొదండరాం ఇరిగేషన్ ను మంత్రి ని కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది. అన్నారం బ్యారెజ్, మేడిగడ్డ పనికిరాదని అంటున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు భద్రత ఉందా అని ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటీ డోకా లేదు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే కాదు అన్నారం ,మేడిగడ్డ ,సుందిళ్ల , మల్లన్నసాగర్ ఇలా ప్రతిదీ భద్రంగానే ఉంటుంది. ఎలాంటి ప్రమాదం లేదని అధికారంగా జవాబు ఇచ్చారు. తాజాగా ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యేగా నా అనుమతి లేకుండా.. నాకు కనీసం సమాచారం ఇవ్వకుండా నా నియోజకవర్గంలో ఓ సబ్ స్టేషన్ పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. నేను నా స్టైల్ లో వెళ్లి ఆ శంకుస్థాపన శిలపలకాన్ని పగులకొట్టాను సాక్షాత్తు సభలోనే అన్నారు.
మరో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నా నియోజకవర్గంలో రైసు మిల్లులు .. ఇతరత్రా మిల్లులు ఎక్కువ.. నా నియోజకవర్గంలో ఉదయం నుండి రాత్రి అనక పగలు అనక కరెంటు కోతలు.. కరెంటు హైవోల్టేజీ.. లోవోల్టేజీ సమస్యలున్నాయి. ఉప ముఖ్యమంత్రి.. సంబంధిత మంత్రి అయిన భట్టీ విక్రమార్క గారిని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నట్లు స్పీకర్ ను అభ్యర్థించారు. మరో ఎమ్మెల్యే.. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ” నల్గోండ నియోజకవర్గంలో తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు. నీళ్ల సమస్య ఉందని చెప్తారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పాలనలో మొదటి ఆరు నెలల్లోనే ఎలాంటి కరెంటు సమస్యలు లేకుండా అన్ని రంగాలకు ఇరవై నాలుగంటల కరెంటును సరఫరా చేసింది. అప్పటి వరకూ ప్లోరైడ్ జిల్లాగా ముద్రపడిన నల్గోండ జిల్లాతో పాటు యావత్ తెలంగాణలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథతో నల్లా ద్వారా తాగునీళ్ళిచ్చింది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతిసారి నా నియోజకవర్గంలో ఆ ఆభివృద్ధి కార్యాక్తమాలు కావాలి.. ఇవి కావాలి అని అడిగారు తప్పా నా నియోజకవర్గంలో కరెంటు సమస్యలు.. తాగునీటి సమస్యలు ఉన్నాయని ఏ సభ్యుడు అడగలేదు.
కానీ కాంగ్రెస్ పదిహేను నెలల పాలనలో మళ్లీ ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులు పునరావృత్తం అయ్యాయా లేదా ఎమ్మెల్యేల మంత్రుల ముఖ్యమంత్రి మధ్య సమన్వయం లోపించిందా అనేది అధికార పార్టీ ఆలోచించుకోవాలి. ఇప్పటికే అన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకున్న అధికార పార్టీ తీరా స్వయంగా తమ పార్టీ సభ్యులే నిండు అసెంబ్లీలో ఈ సమస్యలను ఎకరవు పెట్టడం బయట ఉన్న వ్యతిరేకతను ఒప్పుకున్నట్లేగా,.
