పథకాల అమలులో సీఎం తో సహా మంత్రులు ఆగమాగం..!-ఎడిటోరియల్ కాలమ్ .!
తెలంగాణ రాష్ట్రంలో 612 మండలాలున్నాయి. అంటే.. నేడు 612 గ్రామాలకే ఈ పథకాలు వర్తిస్తాయన్నమాట. ఆ తర్వాత ‘టేక్ ఏ బ్రేక్’ అన్నట్టుగా ఒక బ్రేక్ తీసుకుంటారు. ఉప ముఖ్యమంత్రేమో మార్చి లోపు అందరికీ ఇచ్చేస్తామని స్టేట్‌మెంట్ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత మాట్లాడిన మంత్రులు ముగ్గురూ తలా ఓ మాట మాట్లాడారు. మంత్రి పొంగులేటి భట్టి మాటను పక్కనపెట్టి ఏ గ్రామంలో ఎప్పుడెప్పుడు ఈ పథకాలు అమలు చేస్తామో ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్డ్ ప్రకటిస్తామన్నారు. దీంతో భట్టి మాట తుస్సుమ న్నది.
ఇక పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ఇం కో నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. ఇదంతా నిరంతర ప్రక్రియ అని తేల్చిపారేశారు. బహుశా 10, 15 రోజులకు ముందే జనవరి 26న మొత్తం రేషన్ కార్డులు ఇచ్చేసి ఇంట్లో ప్రతి వ్యక్తికీ 6 కిలోల బియ్యాన్ని ఇచ్చేస్తున్నామని చెప్పుకొచ్చిన మంత్రి అధికారిక ప్రకటన తేదీ వచ్చేసరికి తీరిగ్గా నిరంతర ప్రక్రియగా అని మాట మార్చారు. అంతేకాదు, రేషన్‌కార్డుల పంపిణీ ప్రక్రియ వంద శాతం పూర్తయిన తర్వాతనే 6 కిలోల నాణ్యమైన సన్నబియ్యం ఇస్తామని మరో మాట కూడా అనేశారు. ఈ నిరంతర ప్రక్రియ పూర్తయ్యేదెప్పుడు? వీళ్లు సన్నబియ్యం ఇచ్చేదెప్పుడు?.
ఇక నాలుగో మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా విషయంలో యాసంగిని హరామ్‌గా మింగేశారు. ఒక మంత్రి మార్చి, మరో మంత్రి ఫిబ్రవరి అంటే.. ఈ మంత్రి మాత్రం వచ్చే వ్యవసాయ సీజన్ కంటే ముందుగానే ఘనంగా రైతుభరోసా పంపిణీ పూర్తిచేస్తామ ని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదా పు 70 లక్షల మంది రైతులు యాసంగి అయిపోయినా సరే డబ్బులు పడుతాయేమో అప్పులన్నా తీర్చుకుందామని ఎదురుచూస్తున్నారు. ఇక మంత్రివర్యులేమో వచ్చే సీజన్‌కు అని యాసంగి పెట్టుబడి సాయాన్ని అమాంతంగా దిగమింగేశా రు.
గత యాసంగికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అట్టిపెట్టి ఉంచిన సొమ్ములను నాలుగైదు నెలల పాటు సాగదీసి, సాగదీసి వేశారు. తర్వాత రెండు సీజన్లను ఎగ్గొట్టారు. ఆ సొమ్ములను తీసుకొచ్చి రుణమాఫీలో కాఫీలో కలిపేసినట్టు కలిపేశారు. ఇప్పుడేమో గ్రామం చొప్పున వానకాలం సీజన్ వచ్చేదాకా పంచుతూనే ఉంటామని చెప్తున్నారు. అప్పటికి స్థానిక ఎన్నిక ల తంతు ముగుస్తుంది. ఆ తర్వాత ఈ సాయం ఇస్తారో, లేదో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదు.
పథకాల అమలుకు ప్రభుత్వం ఎందుకింత ఆగమవుతున్నదో అర్థం కాని పరిస్థితి. పాలకులు మారారేమో కానీ, ప్రభుత్వ అధికారులు, శాఖ లు మాత్ర మారలేదు. గతంలో ఇవే పథకాలను సమర్థంగా అమలుచేసిన ప్రభుత్వాధికారులు ఇప్పుడెందుకు చేయలేకపోతున్నారు. ఇందుకు కారణం ఒక్కటే. ప్రస్తుత పాలకులకు తెలంగాణ సోయి లేకపోవడం, తెలంగాణ ఆత్మ తెలియకపోవడం, తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాల గురించిన అవగాహన లేకపోవడం. ‘నేను లీడర్‌ను, నాకు తెలియాల్సిన అవసరం లేదు.
తెలిసిన అధికారులు చుట్టూ ఉంటే చాలు. నేను పాలసీలు చేస్తా, వాళ్లు అమలుచేస్తారు’ అని ఈ మధ్య నే సీఎం రేవంత్‌రెడ్డి అంతర్జాతీయ వేదిక దావోస్‌లో బహిరంగ స్టేట్‌మెంట్ ఇచ్చా రు. ముఖ్యమంత్రే ఈ మాట అన్న తర్వాత ఇక అధికారులు ఎలా వ్యవహరిస్తారో అర్థం చేసుకోవడం కష్టమేం కాదు. ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతాయో చెప్పనక్కరలేదు. రేవంత్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి పరిపాలన విషయంలో అనుసరిస్తున్న విధానాలే ఇందుకు ఉదాహరణ.
రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెప్పుకొంటున్నా ఇప్పటికీ ఏ ఒక్క పథకాన్నీ నూటికి నూరు శాతం అమలుచేశామని చెప్పుకోలేని దుస్థితి. రుణమాఫీ మూడు దశల్లో అమలుచేసినా ఇంకా 30 మంది అమలు కాలేదని అధికార పార్టీ నేతలు చట్టసభల్లోనే చెప్తున్నారు. మంత్రులు కూడా గ్రామసభల్లోనూ ఇదే మాటను అంగీకరించారు.
రూ.500కే గ్యాస్ పంపిణీ కానీ, 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్తు పథకం పరిస్థితీ అంతే. ఒక ఊళ్లో అమలైతే మరో ఊళ్లో గుండు సున్నా. ప్రభుత్వం పూర్తిగా అమలుచేసింది ఏదైనా ఉన్న దా అంటే అది మహిళలకు ఉచిత బస్సు మాత్ర మే. ఏ పథకంలోనైనా ఒక శాతం లోపం ఉం డటం పెద్ద విషయం కాదు, ఆ లోపాన్ని సవరించి రైతుభరోసా ఇచ్చేస్తే సరిపోయేది. ఇందుకోసం మళ్లీ సర్వే మొదలుపెట్టారు. అందులో సాగుయోగ్యమైన భూమిని గుర్తించి ఇస్తారన్నమాట. దీంతో మళ్లీ అవినీతికి తెర లేపినట్టయింది.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక రోజులో సర్వే మొత్తం చేయించి ఆన్‌లైన్‌లో రికార్డులను భద్ర పరిచింది. కానీ, ఈ ప్రభుత్వానికి నమ్మకం లేక వచ్చీరాగానే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది. గత పదేండ్లలో దఫ్తర్ ముఖం చూడని ప్రజలు మళ్లీ దఫ్తర్ మెట్లెక్కి దరఖాస్తులు నింపి ఇచ్చారు. అందులో రైతుభరోసా కూడా ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు ఉన్నది.
రేషన్ కార్డు ఉన్నదని వివరాలు తీసుకున్నారు. ఆ దరఖాస్తులు ఇప్పుడు యాడికిపోయాయో, ఎవరికీ తెలియ దు. మళ్లీ ఈ నాలుగు పథకాల కోసం ప్రభుత్వం గ్రామసభల్లో కొత్త దరఖాస్తుల జాతర మొదలు పెట్టింది. కొత్తగా ఇప్పుడు ఈ నాలుగు పథకాలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థి తి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టుగా తయారైంది. ఏదైతేనేమి బలవుతున్నది మాత్రం అభం శుభం తెలియని అమాయక ప్రజలే.
–డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్
(తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ ,బీఆర్ఎస్ రాష్ట్ర యువనాయకులు)