రంజాన్ మాసంలో ఏర్పాట్లపై సమీక్ష..!

మార్చి రెండవ తేదీ నుండి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో చేయాల్సిన ఏర్పాట్లపై డా. బి. ఆర్. అంబేద్కర్ సచివాలయం, ఆరవ ఫ్లోర్, కాన్ఫరెన్స్ హాల్ లో మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో రంజాన్ మాసంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి దిశానిర్దేశం చేశారు.
రంజాన్ నెలలో నగరంలో పరిశుభ్రత విషయంలో జీహెచ్ఎంసీ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. మసీదు, ఈద్గాల వద్ద ప్రత్యేక శానిటేషన్ బృందాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీధి దీపాల మరమ్మతులు, తాత్కాలిక లైట్ ల ఏర్పాటు చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తామని వెల్లడించారు. మక్కా మసీద్, రాయల్ మాస్క్, మిరాలం ఈద్గా వద్ద ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.
మసీదులు, ఈద్గాల వద్ద వాటర్ ప్యాకెట్స్, తాగునీటి అవసరాల దృష్ట్యా ప్రత్యేక ట్యాంకర్లు, మసీద్ లకు వెళ్లే దారిలో డ్రైనేజీల రిపేర్ పూర్తి… మొదలైన ఏర్పాట్లు చేస్తున్నామని వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి తెలిపారు. వేసవికాలం దృష్ట్యా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, రంజాన్ నెలలో మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. డిమాండ్ కు తగ్గ సప్లై ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. మసీదుల వద్ద, ఈద్గాల వద్ద విద్యుత్ ఎమర్జెన్సీ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీ తౌసిఫ్ ఇక్బాల్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
