రేపు ఘనంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలు..!

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆదివారం వేడుకల వేదిక తెలంగాణ భవన్ లో జరుగుతున్న ఏర్పాట్లను మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ భవన్ ఇంచార్జి రావుల చంద్రశేఖర్ రెడ్డి, యువనేత తలసాని సాయి కిరణ్ యాదవ్, నాంపల్లి నియోజకవర్గ ఇంచార్జి ఆనంద్ గౌడ్, BRS పార్టీ నేతలు విప్లవ్ కుమార్, గుర్రం పవన్ కుమార్ గౌడ్, మన్నె గోవర్ధన్ రెడ్డి, కార్పొరేటర్ లు మన్నె కవిత రెడ్డి, వెంకటేష్, కిషోర్ గౌడ్ తదితరులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు జన్మదిన వేడుకలు ప్రారంభం అవుతాయని అన్నారు. ఎంతో వైభవంగా నిర్వహించే ఈ వేడుకలలో భాగంగా డప్పు కళాకారులు, గిరిజన వేషధారణ నృత్యాల ప్రదర్శన, కళాకారుల తో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, KCR జీవిత, రాజకీయ ప్రస్థానం తో కూడిన ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రదర్శన ఉంటుందని వివరించారు. అంతేకాకుండా 71 వ జన్మదిన సందర్భంగా 71 కిలోల భారీ కేక్ ను కట్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ వేడుకలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీమంత్రులు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యే.. ఎంపీలు, మాజీ ఎమ్మెల్యే.. ఎంపీలు, కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ లు, పార్టీ నాయకులు, అభిమానులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు.
కేసీఆర్ జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, పండ్ల పంపిణీ, అన్నదానం, వివిధ ప్రార్ధనా మందిరాలలో ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన వేడుకలు ప్రారంభమైనాయని, అనేక ప్రాంతాలలో రైతులు వివిధ రకాలుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారని తెలిపారు.
