నాకు ఎంతో బాధ కలిగించింది-మాజీ సీఎం కేసీఆర్
చత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి విద్యుత్ కొనులుగోలు గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ గా వచ్చిన మీరు పత్రికా విలేఖరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది. నిజానికి మీ పిలుపు మేరకు, లోక్ సభ ఎన్నికల తర్వాత, 2024 జూన్ 15లోగా నా అభిప్రాయాలను మీకు సమర్పించాలని అనుకున్నాను.
కానీ ఒక ఎంక్వయిరీ కమిషన్ సంప్రదాయాలకు విరుద్ధంగా, విచారణ పూర్తికాక ముందే మీరు విలేఖరుల సమావేశం నిర్వహించడం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి, పదేండ్లు పరిపాలించిన నా పేరును ప్రస్తావించడం, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయదలిచి ఇచ్చినట్టు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది.
విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఇరు పక్షాల మధ్య ఒక వివాదం తలెత్తినప్పుడు, మధ్యవర్తిగా నిలిచి, అసలు నిజాన్ని నిగ్గుతేల్చాల్సిన విధి. అన్ని విషయాలను, అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి, పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత,
డాక్యుమెంటరీ ఎవిడెన్స్ బాధ్యులకు మాత్రమే నివేదిక ఇవ్వాల్సిన గురుతరమైన పని. కానీ మీ వ్యవహారశైలి అట్లా లేదని చెప్పడానికి చింతిస్తున్నాను.
ఎంక్వయిరీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు చేసిన ఏ వ్యాఖ్యను గమనించినా, మీరు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మాట్లాడుతున్నట్టు స్పష్టమవుతున్నది. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్టు, ఇక ఆ తప్పు వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్టు మీ మాటలు స్పష్టంచేస్తున్నాయి.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైనప్పటికీ మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నది. విచారణ పూర్తి కాక ముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతున్నది. పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని మీరు ఈ ఎంక్వయిరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను అని జస్టిస్ నరసింహ రెడ్డి గారికి పంపిన లేఖలో కేసీఆర్ పేర్కోన్నారు.