కల్వకుర్తి పనులు త్వరగా పూర్తవ్వాలి
డిసెంబర్ 2025 లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంలో గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రాజెక్టు పనుల్లో పురోగతిని ప్రతి నెలా సమీక్ష నిర్వహించాలని చెప్పారు. నిర్ధేశిత గడువులోగా కల్వకుర్తి పూర్తి చేసే ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయిలో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు.
మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ దామోదర రాజనర్సింహ శ్రీ జూపల్లి కృష్ణా రావు, తెలంగాణ ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షులు శ్రీ చిన్నారెడ్డి సీఎం సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో జిల్లాలో వివిధ పథకాల పురోగతి, తీసుకుంటున్న చర్యలపై సమగ్రంగా సమీక్షించారు.
జిల్లాలో మొత్తంగా రూ. 396.09 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు వివిధ పనులకు శంకుస్థాపన చేశారు. మొదట కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌లను ప్రారంభించారు.
అలాగే, పాలమూరు వర్సిటీలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాలికల హాస్టల్ నిర్మాణం, దేవరకద్రలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం, మహబూబ్‌నగర్ రూరల్ మరియు గండీడ్‌లో కేజీవీబీ భవనాల నిర్మాణం, మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, స్టోరేజ్ ట్యాంక్ పనులు, ఎస్టీపీ నిర్మాణం వంటి కార్యక్రమాలకు సీఎం గారు శంకుస్థాపన చేశారు.