ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి
హైదరాబాద్ గాంధీ భవన్‌లో నిర్వహించిన ప్రజలతో మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున కార్యక్రమానికి హాజరై మంత్రి జూపల్లికి పలు సమస్యలపై దరఖాస్తులు, ఫిర్యాదులు అందజేశారు.
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఫించన్లు, రెవెన్యూ, తదితర సమస్యలపై ప్రజలు దరఖాస్తులు అందజేశారు. దరఖాస్తులకు స్వీకరించినప్పుడు మంత్రి జూపల్లి ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో పాటు ఇతర సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వాటిని పరిష్కరించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 103 దరఖాస్తులను మంత్రి ప్రజల నుంచి స్వీకరించారు.
అంతకుముందు మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ హయాంలో ప్రజస్వామ్యం ఖూనీ అయింది. నిరంకుశంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ ది కుటుంబ, అవినీతి పాలన. ప్రజల స్వేచ్చను హరించారు. పత్రిపక్షంతో పాటు స్వపక్ష గొంతునొక్కారు. కానీ సీయం రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం ..ప్రజల అకాంక్షల మేరకు నడుచుకుంటుంది. ప్రజలిచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందర్నీ కలుపుకొని పోతున్నారు. మా ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవరిస్తుంది. మహత్మా జ్యోతిబాపూలే భవన్ తో పాటు జిల్లాల్లో ప్రజా వాణి ద్వారా ప్రజల వినతిపత్రాలను స్వీకరించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నాం. టీపీసీసీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించాక.. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు వారంలో ఒక రోజు మంత్రులు గాంధీ భవన్‌లో ఉండేట్లు ప్రజలతో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం ద్వారా సరికొత్త సంప్రదాయానికి నాంది పలికారు. గాంధీభవన్ లో కూడా పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజల సమస్యలు వింటున్నామని వివరించారు.
బీఆర్ఎస్ నేతల అరెస్ట్ విషయంపై స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో చట్టానికి ఎవరు అతీతులు కారని,
చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలించాలి గానీ, కేసీఆర్ ఫాం హౌస్ కు పరిమితమై… తన కొడుకు, అల్లుడిని పట్టించుకోవడం లేదని అన్నారు. గత బీఆర్ఎస్ పాలకుల మాదిరి నిరంకుశంగా వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు. దర్నాలు చేసుకునే స్వేచ్చను ఇచ్చిందని, దాన్ని దుర్వినియోగం చేస్తే సహించేది లేదని చెప్పారు.
ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తున్నామని, మా ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోందని, వారు ఎంత గీపెట్టిన ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని వెల్లడించారు.