జూబ్లీహిల్స్ టికెట్ నాకే -కాంగ్రెస్ మాజీ ఎంపీ

Former Congress MP
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మరో రెండు నెలల్లో జరగనున్న బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ తరపున దివంగత మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆప్రచారానికి తగ్గట్లుగానే దివంగత మాగంటి గోపినాథ్ సతీమణి సునీత నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు.తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో తాను బరిలో ఉన్నట్లు ఆ పార్టీ సీనియర్ మాజీ ఎంపీ, ప్రస్తుత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులుగా రెండుసార్లు గెలిచాను, ఆ పదేండ్ల కాలంలో ఎంపీగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశాను. పార్టీకి కష్టకాలంలో తాను అండగా ఉన్నాను. ఇప్పుడు గెలిచిన తర్వాత తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.