జనసేనానికి అంత ధైర్యం లేదా…?
జనసేనాని.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే ధైర్యం లేదా..?. తప్పు చేసిన వాడు తానైన సరే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పే మాటలు కేవలం డైలాగ్స్ మాత్రమేనా..?. మాటలకు చేతలకు అసలు పొంతన ఉండదా..?. అంటే ప్రస్తుతం జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలను బట్టి అవుననే చెప్పాలి అంటున్నారు..
ఇటీవల ఓ మహిళ తనపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపించగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ను ఏకంగా పార్టీ నుండి సస్పెండ్ చేశారు.. సదరు మహిళ తనపై ఎమ్మెల్యే ఎలాంటి లైంగిక దాడి చేయలేదు. తన కేసును వాపస్ తీసుకుంటున్నట్లు హైకోర్టుకు అపిడవిట్ సమర్పించిన కానీ ఇంతవరకూ బాబు సదరు ఎమ్మెల్యేపై ఆ వేటును తీసేయలేదు.. అంటే పార్టీలో తప్పు చేసినవాళ్ళు ఎంతటీవారైన సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని సందేశాన్ని క్యాడర్ కు పార్టీ నేతలకు బాబు గట్టిగా పంపారు.
మరోవైపు తన దగ్గర పనిచేసే జూనియర్ కోరియోగ్రాఫర్ తనపై లైంగిక దాడికి దిగారు.. అంతేకాకుండా తనను మానసికంగా.. భౌతికంగా హింసించారని జనసేనలో యాక్టీవ్ గా ఉన్న జానీ మాస్టర్ పై ఆరోపిస్తూ కేసు పెట్టింది. దీంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి జానీ మాస్టర్ ను అరెస్ట్ చేయడం.. కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు కూడా తరలించారు.. మరోవైపు తాజాగా కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఓ కార్యక్రమంలో దళిత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ ను అత్యంత పరుష పదజాలంతో దూషించారు..
అక్కడితో ఆగకుండా అందరి ముందు అవమానకరపరిస్థితుల్లో ఆ డాక్టర్ పై విరుచుకుపడ్డాడు. అయిన కానీ ఇంతవరకూ జనసేనాని వీరిద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.. జానీ మాస్టర్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పారే తప్పా పార్టీ నుండి సస్పెండ్ చేయలేదు.. ఇక పంతం నానాజీ విషయంలో కూడా కనీసం అలాంటి ఆదేశాలు ఏమి లేవు.. తప్పు చేసినవారిపై చర్యలు తీసుకునే అంత ధైర్యం పవన్ కు లేదని రాజకీయ వర్గాల గుసగుసలు.