తప్పు అల్లు అర్జున్‌దా?.. ప్రభుత్వానిదా..?

 తప్పు అల్లు అర్జున్‌దా?.. ప్రభుత్వానిదా..?

Is it Allu Arjun’s fault?.. or the government..?

పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్ ఎదుట జరిగిన తొక్కిసలాట ఘటన ఇటు రాజకీయ, అటు సినీ రంగాలతో పాటు అన్ని వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి కర్త కర్మ క్రియ అంతా ఈ చిత్రం హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌దే‌. ప్రీమియర్ షో కి రావోద్దని పోలీసులు సూచించారు. అయిన అల్లు అర్జున్ భేఖాతరు చేసి మరి ఆర్టీసీ మెట్రో స్టేషన్ దగ్గర నుండి థియోటర్ వరకు రోడ్ షో చేయడం వల్లే తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మరణానికి దారితీసింది అని కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తుంది.

దీనిపై ఏకంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలోనే చర్చ పెట్టారు కూడా. ఇంకోవైపు ఈ ఘటన గురించి శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఇది దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం మాత్రమే..ఇందులో ఎవరి తప్పు లేదు.. అనుమతి ఉన్నందుకే తాను థియేటర్ వద్దకు వచ్చానని అంటున్నారు. తన క్యారెక్టర్‌ను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు. మరి ఈ ఇరువర్గాల్లో ఎవరిది తప్పు ఒక్కసారి ఆలోచిద్దాము..!

తప్పు పోలీసులదా? …అల్లు అర్జున్‌దా?.. ప్రభుత్వానిదా..?

ఈ ఘటనలో ఇటు పోలీసులది లేదు.. ప్రభుత్వానిది లేదు… కేవలం హీరో అల్లు అర్జున్ దే తప్పన్నట్లు ఇటు మీడియాతో పాటు అటు ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రచారం. అసలు నిజానికి హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నా ప్రీమియర్ షో చూసేందుకు సంధ్య థియేటర్ కు వస్తున్నారు. దానికితగినట్లు భద్రత కల్పించాలని ఆ హాల్ యాజమాన్యం స్థానిక పీఎస్ తో పాటు కమీషనర్ కార్యాలయంలో అనుమతికోసం లేఖ రాసినట్లు ఓ లేఖను సైతం విడుదల చేశారు. దీని ప్రకారం హీరోహీరోయిన్లు రావడానికి అనుమతి కూడా తీసుకున్నట్లైంది. అంటే అల్లు అర్జున్ వస్తున్నారని, జనాలు భారీగా వస్తారని పోలీసులకు ముందే తెలుసు. కానీ బందోబస్తు కల్పించడంలో ఇటు పోలీసులు గానీ, అటు ప్రభుత్వం గానీ విఫలమైన మాట వాస్తవం. కానీ ఆ వైఫల్యం నుంచి తప్పించుకునేందుకు అల్లు అర్జున్ మీద, థియేటర్ మీద ఆ నిందను వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ తరుఫు లాయర్ వాదించినట్లు డ్యూటీ చేయాల్సిన పోలీసులే అల్లు అర్జున్‌ని చూసేందుకు ఎగబడ్డారు.. కాబట్టి కంట్రోల్ తప్పి తొక్కిసలాట జరిగిందన్న వాదన కూడా ఉంది.ఒకవేళ అనుమతి లేకపోతే పోలీసులు అల్లు అర్జున్ ను అడ్డుకోవాలి.. లేదా ఇంటి నుండి రాకుండానే ఆపాలి. అలా లేదు కాబట్టి ఇందులో తప్పు ఎవరిదో కండ్లకు కట్టినట్లు ఆర్ధమవుతుంది.

పేరు మర్చిపోయినందుకా? డైవర్షన్ రాజకీయాలా..?

అల్లు అర్జున్ ను అసలు అరెస్ట్ చేయడానికి కారణం ఇటీవల జరిగిన పుష్ప-2 సక్సెస్ మీట్‌లో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు కక్షతోనే ఇదంతా చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపించాయి. మరోవైపు ఇవి సీఎం రేవంత్ మార్క్ డైవర్షన్ పాలిటిక్స్ అని మరికొందరు అంటున్నారు. ‘హైడ్రా’తో కాంగ్రెస్ ప్రభుత్వానికి హైదరాబాద్‌లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ముందే జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. దీంతో ఆ వ్యతిరేకతను కొంతైనా పోగొట్టుకునేందుకు నగరంలో ఏం జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. నగర ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదనే సందేశాన్ని ఇచ్చేందుకే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారని కూడా వాదనలు ఉన్నాయి.

అరెస్ట్ ఎంతవరకు కరెక్ట్..?

ఈ ఘటనలో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అన్నది ప్రశ్న. గతంలో చాలా సందర్భాల్లో రాజకీయ సభల్లో, ఇతర కార్యక్రమాల్లో తొక్కిసలాటలు జరిగాయి. 2024 మే 19న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో రాహుల్ గాంధీ పాల్గొనాల్సి ఉన్న కాంగ్రెస్ సభలో తొక్కిసలాట జరిగి పలువురు గాయాల పాలయ్యారు. అప్పుడు రాహుల్ గాంధీపై కనీసం కేసైనా నమోదైందా? యూపీలోని హత్రాస్‌లో భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు. ఎక్కడదాకో ఎందుకు పక్కనున్న ఆంధ్రాలో బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన పుష్కరాల్లో దాదాపు నలబై మంది చనిపోయారు. అప్పుడు మరి ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ బన్నీ ఫ్యాన్స్ వేసిన ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పలేదు. సాక్షాత్తు తెలంగాణలో ‘హైడ్రా’ అధికారులు తమ ఇళ్లను కూల్చేస్తారని భయంతో గుండెపోటుతో మృతి చెందిన ఘటనల్లో సీఎంను కూడా అరెస్ట్ చేస్తారా?.. రేవంత్ రెడ్డి సొంత ఇలాఖాలో కొండరెడ్డిపల్లి సర్పంచ్ ఏకంగా ముఖ్యమంత్రి సోదరుల పేర్లు రాసి మరి ఆత్మహత్య చేసుకున్నారు. గురుకులాల్లో యాబై నాలుగు మంది విద్యార్థులు చనిపోయారు. దీనికి ఎవరూ బాధ్యులు.. దీనికి బాధ్యతగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అంటూ బన్నీ ఫ్యాన్స్ తో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

కేవలం అల్లు అర్జున్‌నే బాధ్యుడిని చేయడం కరెక్టా..?

ఎవరెన్ని వాదనలు విన్పించిన.. ఎవరూ ఎవర్కి మద్ధతుగా మాట్లాడుకున్న కానీ ఒక్కటి మాత్రం క్లియర్ కట్. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అభిమాని రేవతి మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఇప్పటికీ ఆసుపత్రి వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటూ ఉండటం నిజంగా బాధాకరం, దురదృష్టకరం. ఈ ఘటన పట్ల అటు అల్లు అర్జున్ అయినా, ఇటు తెలంగాణ ప్రభుత్వమైనా బాధ్యతాయుతంగా నడుచుకోవాలి. కానీ ఈ ఘటనకు పూర్తిగా అల్లు అర్జున్‌నే బాధ్యుడిని చేయడం కూడా కరెక్ట్ కాదు.. ఇందులో తెలంగాణ ప్రభుత్వానిది, ముఖ్యంగా పోలీసుల వైఫల్యం కూడా ఉందన్నది సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకోలేకపోతున్న చేదు నిజం అని సినీ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *