ఆంధ్రలో అమానవీయ ఘటన
ఆంధ్రప్రదేశ్‌లో ఓ అమానవీయ ఘటన వెలుగు చూసింది.. కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థునుల జుట్టు కత్తిరించారు.. ఈ ఘటన అల్లూరి సీతారామ రాజు జిల్లాలో చోటు చేసుకుంది.. కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరించడం విమర్శలకు దారితీసింది. జి. మాడుగుల KGBV జూనియర్ కాలేజ్ హాస్టల్ లో ఈ నెల 15న ఈ ఘటన జరిగింది. ఉదయం ప్రతిజ్ఞకు హాజరుకాలేదన్న కారణంతో ప్రత్యేక అధికారిణి విద్యార్థినుల జుత్తును కొద్దికొద్దిగా కత్తిరించగా.. తల్లి దండ్రుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
కార్తిక పౌర్ణమి రోజు స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నీరు అందుబాటులో లేదు. దీంతో, బైపీసీ రెండో ఏడాది విద్యార్థులు కొందరు ఉదయం ప్రతిజ్ఞకు ఆలస్యంగా హాజరయ్యారు. 23 మంది విద్యార్థినులు రాలేదని ప్రత్యేక అధికారిణి సాయిప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులను ఎండలో నిల్చో పెట్టారు. మధ్యాహ్న భోజన విరామంలో 18 మంది విద్యార్థినుల జుట్టు కత్తిరించారు.
అయితే, విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పడం.. వాళ్లు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది.. మరోవైపు.. జుట్టు విరబోసుకుని తిరుగుతున్నందుకు శిక్ష విధించినట్టు చెప్పుకొచ్చారట ప్రత్యేక అధికారిణి.. అయితే, ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదం కావడంతో.. విద్యాశాఖ విచారణ చేపట్టింది.