గ్రీన్ సిటీగా హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ ను ఇండోర్ తరహాలో అద్భుతమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారులు ఇండోర్ కు వెళ్లి అధ్యయనం చేయాలని అన్నారు.హైదరాబాద్ అభివృద్ధితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్ పాత్ ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై ముఖ్యమంత్రి గారు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం కింద చేపట్టిన 811 కిలోమీటర్ల రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్ల వివరాలతో 15 రోజుల్లోగా తనకు పూర్తి నివేదికను అందించాలని సీఎం ఆదేశించారు. తప్పుడు నివేదికలు ఇస్తే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఇంటి నుంచి నిత్యం చెత్త సేకరించేలా పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. అవసరమైతే జీఐఎస్, క్యూ ఆర్ స్కాన్ లాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సీఎం చెప్పారు. జీహెచ్ఎంసీలో నిధుల సమీకకరణకు స్పష్టమైన ప్రణాళికలు చేసుకోవాలన్నారు.
మూసీ రివర్ డెవెలప్మెంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివాసితులకు పునరావాసం కల్పించాలని స్పష్టం చేశారు. ఎక్కడా తమకు అన్యాయం జరిగిందని నిర్వాసితులు బాధ పడకుండా, వారికి భరోసా కల్పించాలని చెప్పారు. అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలని సీఎం ఆదేశించారు.
చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తున్నందున, స్టేషన్ ముందు పార్కింగ్, పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్ కు చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పరిసరాల్లో ఉన్న అటవీ శాఖ భూమిని, పరిశ్రమల విభాగం భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని, అక్కడున్న పరిశ్రమలను మరో చోటికి తరలించాలని చెప్పారు.
సమీక్షా సమావేశంలో సీఎం గారితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.