రైతుల ఆందోళనలో హర్యానా పోలీసుల డ్రామా..!!
తమ డిమాండ్ల సాధనకు రైతులు ఆదివారం ఢిల్లీకి కొనసాగించిన పాదయాత్రను పోలీసులు మరోసారి భగ్నం చేశారు. పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు వద్ద శుక్రవారం రైతులు ప్రారంభించిన పాదయాత్రపై పోలీసులు బాష్ప వాయు గోళాలు ప్రయోగించడంతో పలువురు గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం నాటి ఆందోళనలో హర్యానా పోలీసులు చాలా నాటకీయంగా వ్యవహరించారు. 101 మంది రైతులు తిరిగి యాత్ర ప్రారంభించగా, వారికి పోలీసులు టీ, బిస్కెట్లు పంచి ఆశ్చర్చపరిచారు. అంతేకాకుండా వారిపై పూల రేకలను కూడా చల్లడంతో రైతులు విస్తుపోయారు.
రైతులు ఢిల్లీ వైపు వెళ్లడానికి ప్రయత్నించగా, అప్పటి వరకు తాము ఆడిన డ్రామాకు తెరదించిన పోలీసులు వారిని అడ్డుకోవడం ప్రారంభించారు. రైతులను చెదరగొట్టడానికి నిర్దాక్షిణ్యంగా బాష్పవాయు గోళాలు, జల ఫిరంగులు ప్రయోగించారు. ఈ ఘటనలో 8 మంది రైతులు గాయపడగా, ఒకరిని దవాఖానకు తరలించినట్టు రైతు నేత శర్వణ్ సింగ్ పాంథేర్ తెలిపారు. రైతు పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఆయన ప్రకటించారు. తదుపరి కార్యాచరణను సోమవారం నిర్ణయిస్తామని చెప్పారు.
నోయిడాలో ఆందోళన చేయడంతో అరెస్టయి జైలులో ఉన్న రైతులు తమ డిమాండ్ల సాధనకు జైలులో నిరాహార దీక్ష ప్రారంభించినట్టు సంయుక్త కిసాన్ మోర్చా ఆదివారం తెలిపింది. ప్రస్తుతం గౌతమబుద్ధ నగర్ జైలులో ఉన్న రైతులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల సాధనకు ఈ దీక్ష చేపట్టారని పేర్కొంది. ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉన్నా డిమాండ్లు నెరవేరే వరకు దీక్ష చేస్తామని రైతులు స్పష్టం చేశారన్నారు.