కొత్త రేషన్ కార్డులకు మార్గదర్శకాలు విడుదల
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి పండగ వేళ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.కుల గణన (SEEEPC) సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్లతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్ కు క్షేత్ర స్థాయి పరిశీలన కోసం పంపబడుతుందని తెలిపింది. మండల స్థాయిలో ఎంపిడిఓతోపాటు యూఎల్‍బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులుగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లేదా జీసీఎస్ఓ పర్యవేక్షకులుగా వ్యవహరించనున్నారు.
ముసాయిదా జాబితాను గ్రామసభతోపాటు వార్డు సభలో ప్రదర్శించి.. చదివి వినిపించి.. అనంతరం చర్చించిన తరువాత ఆమోదిస్తారు. అలాగే గ్రామసభ లేదా వార్డు సభల ద్వారా ఆమోదించబడిన లబ్దిదారుల అర్హత జాబితాను మండల లేకుంటే మున్సిపల్ స్థాయిలో ఇచ్చిన లాగిన్ లో నమోదు చేసి జిల్లా కలెక్టర్ లేదా జీహెచ్ఎంసీ కమీషనర్ లాగిన్‍కు పంపాలని తెలిపింది.తుది జాబితా ప్రకారం.. సీసీఎస్ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. ఆ క్రమంలో అర్హత కలిగిన వారికి.. ఒకే ఒక్క ఆహార భద్రత (రేషన్) కార్డులో పేర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆహార భద్రత (రేషన్) కార్డులలో కుటుంబ సభ్యుల మార్పులు.. చేర్పులు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
గణతంత్ర దినోత్సవం ఈ నెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత రేషన్ కార్డులు జారీ కానున్నాయి. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉన్న వినతుల పరిష్కారం కోసం సర్కారు ముందడుగు వేసినట్లయింది. కొత్త రేషన్ కార్డుల మంజూరుతోపాటు.. పాత రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులు కూడా చేయనున్నారు.