మహబూబ్ నగర్ లో రైతు పండగ..!
ఈనెల 28,29,30 తేదీల్లో మహబూబ్ నగర్ లో నిర్వహించే రైతు పండుగ విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి పనిచేయాలని రాష్ట్ర మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, శ్రీ జూపల్లి కృష్ణారావు, శ్రీ దామోదర్ రాజనర్సింహలు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈనెల 28,29,30 తేదీలలో నిర్వహించే రైతు సదస్సు ఏర్పాట్లపై నేడు సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మరే రంగానికి లేని విధంగా వ్యవసాయ రంగానికి అధిక మొత్తం నిధులు కేటాయించిందని, ముఖ్యంగా రైతు రుణమాఫీతో రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గంలో కనీసం 20 వేల మంది నుండి 30 వేల మంది రైతులకు లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు.
రైతులకు పెద్ద ఎత్తున చేకూరిన ఈ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు, వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, ఆదర్శ రైతుల ప్రసంగాలు, ఈ రైతు సదస్సులో ప్రధాన అంశాలుగా ఉంటాయని తెలిపారు. ఈనెల 28 న ఉదయం 10 గంటలకు ఈ రైతు సదస్సు ప్రారంభమవుతుందని, ఈ మొదటి రోజు సదస్సుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైతులు హాజరవుతారని, ఈ ప్రారంభ సమావేశాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా తాను ప్రారంభిస్తానని, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు హాజరవుతారని తుమ్మల చెప్పారు.
రెండోరోజైన 29న మహబూబ్ నగర్ జిల్లాయేతర ప్రాంతాలనుండి రైతులు హాజరవుతారని, 30న రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుండి కనీసం లక్షమంది రైతులు ఈ రైతు సదస్సుకు హాజరవుతారని వివరించారు. మొదటి రెండు రోజులు ప్రతీ రోజు 5000 మంది రైతులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 30వ తేదీన సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.
ఈ మూడు రోజులు రైతు సదస్సు వేదికపై ఆదర్శ రైతులచే ప్రసంగాలు, ఆధునిక వ్యవసాయ విధానాలపై వివరణలు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, మత్స్య తదితర రంగాలకు చెందిన ఆదర్శ రైతులచే ప్రసంగాలు, విజయగాథలపై వీడియో ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. ఒక్కొక్క పంటకు సంబంధించి ఒక్కొక్క ఆదర్శ రైతు, వారి అనుభవాలు ఈ సదస్సులో వివరిస్తారని మంత్రి తెలిపారు.