ప్రజలకు డాక్టర్లు అందుబాటులో ఉండాలి- ఎమ్మెల్యే జీఎస్సార్

Gandra Satyanarayana Rao Member of the Telangana Legislative Assembly
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, ఖాళీగా ఉన్న సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు మంగళవారం జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఆసుపత్రి పర్యవేక్షకులు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్, వైద్య సిబ్బందితో సౌకర్యాలు కల్పన, సిబ్బంది నియామకం, మెరుగైన వైద్య సేవలకు అధునాతన పరికరాలు ఏర్పాటు తదితర అంశాలపై ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… వైద్యులు నిబద్ధతతో పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తద్వారా జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ అత్యంత ప్రధానమని స్పష్టం చేశారు. 24 గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి అవసరమైన సిబ్బంది నియామకానికి, పరికరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రిలో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. మహారాష్ట్ర నుండి ప్రజలు వైద్య సేవలకు వస్తుంటారని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రి సేవలపై ప్రజలకు నమ్మకం కలిగేలా సేవలు అందించాలని ఆసుపత్రిలో ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఆసుపత్రిలో పారిశుధ్యం, క్లీనింగ్ బాగా లేదని అన్నారు. మురుగు నీరు నిల్వలు లేకుండా డ్రైనేజీ పనులు చేపట్టి నీళ్లు బయటికి పంపేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. సేవలకు ప్రజలు పెద్దఎత్తున వస్తున్నందున శానిటేషన్ పనులు నిర్వహణకు అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది నియామకానికి కావలసిన విభాగాల ప్రత్యేక వైద్యులను నియమిస్తామని తెలిపారు. ఇప్పటికే సి.ఎస్.ఆర్ నిధుల ద్వారా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక చొరవతో సి.టి స్కాన్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని త్వరలోనే సి.టి స్కాన్ మిషన్ ను ప్రారంభించి రోగులకు సేవలు అందుబాటులోకి తెస్తామని అన్నారు.