నిన్న కాకినాడ.. నేడు నెల్లిమర్ల.కూటమిలో బీటలు.?
ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలకమైన టీడీపీ,జనసేన పార్టీల మైత్రీకి బీటలు పడనున్నాయా..?. ఇప్పటికే జనసేన పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ కు పలు అవమానాలు ఎదురవుతున్నాయా..?. జనసేన పార్టీ నాయకులను .. కార్యకర్తలను కాదని టీడీపీ పార్టీ క్యాడర్ కు కనీసం అటెండర్ స్థాయి అధికారి కూడా స్పందించడం లేదా..?. ఐదేండ్లు ఎన్నో అవమానాలను.. కేసులను ఎదుర్కుని తమ పార్టీని కాదని మిత్రపక్ష ధర్మాన్ని అనుసరించి జనసేన ఎమ్మెల్యేలను గెలిపిస్తే తగిన బహుమతి ఇస్తున్నారు అని తెలుగు తమ్ముళ్ళు వాపోతున్నారా..?. అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే అంటున్నారు.
కాకినాడ సిటీ సంఘటన మరిచిపోకముందే తాజాగా నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ జనసేన కుమ్ములాటలు వెలుగులోకి వచ్చాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కంచుకోట అయిన నెల్లిమర్లను మిత్రపక్ష ధర్మాన్ని అనుసరించి జనసేన నాయకురాలు లోకం నాగ మాధవికి మద్ధతుగా నిలిచి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించారు. గెలిచిన మరుసటి రోజు నుండే జనసేన పార్టీ బలోపేతం గురించి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ అయిన కర్రోతు బంగార్రాజును పలుమార్లు అవమానించారు.
ఆ పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి క్యాడర్ వరకు పనికోసం ఏ కార్యాలయానికెళ్ళిన సరే పని చేయద్దని సంబంధితాధికారులకు ఎమ్మెల్యే మాధవి హూకుం జారీ చేశారంట. అందుకే అఖరికి ఇటీవల కార్పోరేషన్ చైర్మన్ అయిన కానీ కర్రోతు బంగార్రాజు మాటకు విలువ ఇవ్వడం లేదంట.. టీడీపీ క్యాడర్ ఏదైన పనికెళ్తే జనసేన నాయకులను తీసుకురావాలని సూచిస్తున్నారు అంట అధికారులు. ఒకవేళ వాళ్లు రాకపోతే జనసేన పార్టీ కండువా కప్పుకోవాలని ఆదేశిస్తున్నారట. పార్టీ ఆవిర్భావం నుండి నియోజకవర్గంలో పార్టీకోసం కష్టపడిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు మధ్యలో వచ్చి తమ కష్టంతో గెలుపొందిన ఎమ్మెల్యే కింద పనిచేయడం.. అది కూడా ఆత్మగౌరవాన్ని చంపుకుని అని కర్రోతు బంగార్రాజు ఎదుట వాపోయారంట.
మిత్రపక్షం అని ఆధిష్టానం ఆదేశాలున్నాయని కర్రోతు బంగార్రాజు చేతులెత్తేయడంతో తెలుగు తమ్ముళ్ళు వాపోతున్నారంట. ఇప్పటికైన ఆధిష్టానం కళ్లు తెరవకపోతే కంచుకోట నియోజకవర్గమైన నెల్లిమర్లలో క్యాడరే లేకుండా పోతారని వారు హెచ్చరిస్తున్నారంట. మరి బాబు గారు క్యాడర్ ను కాపాడుకుంటారో..?. లేదా మిత్ర పక్షం అని క్యాడర్ ను చంపుకుంటారో అని తెలుగు తమ్ముళ్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారంట.