పొన్నం,మధు యాష్కీకి క్రెడిటీవ్వాలి ..కానీ ఈ దేవెందర్ గౌడ్ కి ఎందుకు-ఎడిటోరియల్ కాలమ్..!

Madhu Goud Yaskhi Former Member of the Lok Sabha
ఎవరూ అవునన్నా.. కాదన్నా తెలంగాణ ఉద్యమంలో అప్పటి రాష్ట్ర కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపున పాల్గోన్నవారిలో అగ్రగణ్యులు అప్పటి ఎంపీలు పొన్నం ప్రభాకర్ గౌడ్, మధుయాష్కీ. అప్పుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత మాజీ సీఎం.. తెలంగాణ భద్ధవ్యతిరేకిగా ముద్రపడిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సైతం ఎదిరించి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్ధతుగా నిలిచారు. అయితే వీళ్లకు క్రెడిట్ ఇవ్వకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి టీడీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ.. మాజీ మంత్రి అయిన దేవెందర్ గౌడ్ ను ఉద్యమ నేతగా పెద్దఎత్తున క్రియేట్ చేయాలనే ఉద్ధేశ్యంతో ఇటీవల జరిగిన ఓ పుస్తావిష్కరణ కార్యక్రమంలో ఉద్యమంలో ముందున్నారని అన్నారు.
దీంతో ఉద్యమ చరిత్రనే మార్చాలని ప్రస్తుత సీఎం చూస్తున్నారు అని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. అసలు తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చాలనే .. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ చేతుల్లోంచి ఎప్పుడెప్పుడు లాగి వేరొకరి చేతిలో పెడదామా అని గోతికాడ నక్కల్లా చూస్తున్న శక్తులకు ఇదొక మంచి అవకాశం లాగా తోచింది. అప్పటికే తెలుగుదేశంలో నెంబర్ 2 గా ఉన్న దేవేందర్ గౌడ్‌ను తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించాల్సిందిగా కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు ముందుకు నెట్టాయి. సహజంగానే కొన్ని సీమాంధ్ర మీడియా సంస్థలు దీనికి వంతపాడాయి.14 ఆగస్టు 2008 నాడు దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి నవ తెలంగాణ ప్రజా పార్టీని నెలకొల్పారు.
చాలామంది నాయకులు ఆయన వెంటవెళతారని ఊదరగొట్టినా, ఒకరిద్దరు తప్ప ఎవరూ ఆయన పార్టీలో చేరలేదు. కొన్ని సంఘాలు తొలుత దేవేందర్ గౌడ్ పార్టీ పట్ల ఆసక్తి చూపించినా చివరకు వాళ్లెవరూ ఆయనతో ఎక్కువకాలం కొనసాగలేదు. పార్టీ పెట్టిన ఆరునెలలకే దాన్ని నడపడం తన వల్ల కాదని చేతులెత్తేశారు దేవేందర్ గౌడ్. ఫిబ్రవరి 2009లో తన పార్టీని చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేసేసి చేతులు దులుపుకున్నారు. మొత్తంగా ఆయన పార్టీని ముక్కుతూ మూలుగుతూ నడిపింది 196 రోజులు మాత్రమే! 2009 ఏప్రిల్‌లో జరిగిన జనరల్ ఎలెక్షన్స్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానం నుండి, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానం నుండి ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేశారు.
కానీ రెండు చోట్లా మూడో స్థానంలో నిలిచారు.ఎన్నికల్లో ఓడిపోయిన మూడు నెలల్లోనే (ఆగస్ట్ 2009) తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరి తాను పార్టీ పెట్టడం చారిత్రక తప్పిదం అని లెంపలు వేసుకున్నాడు. 2012లో చంద్రబాబు ఇచ్చిన రాజ్యసభ ఎంపీ పదవి తీసుకుని క్రియాశీలక రాజకీయాల నుండి మెల్లగా కనుమరుగు అయ్యారు.ఇదీ దేవేందర్ గౌడ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర! అంటూ తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.
