సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన విజయవంతం
అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటనను విజయవంతంగా ముగించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. పది రోజుల పాటు సాగిన పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా ఆయనకు విమానాశ్రయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఉన్నతస్థాయి అధికారుల బృందంతో సాగిన ఈ పర్యటన తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ప్రత్యక్షంగా, పరోక్షంగా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులే లక్ష్యంగా సాగింది. 50 కిపైగా రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు, ముఖాముఖి సమావేశాల్లో పాల్గొని #TelanganaTheFutureState పై ప్రణాళికలను సమగ్రంగా వివరించారు.
ముఖ్యంగా నెట్ జీరో సిటీ, #AICity, #SkillUniversity, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ వంటి అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, డేటా సెంటర్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలకు చెందిన కంపెనీలతో పాటు ఫార్మా, లైఫ్ సైన్సెస్, కాస్మటిక్స్, టెక్స్‌టైల్, ఎలక్ట్రిక్ వాహన రంగాలకు చెందిన అనేక కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు.
పెట్టుబడులకు తెలంగాణలో ఉన్న సానుకూలతలను వివరించారు. తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రణాళికలను సోదాహరణగా సదస్సుల్లో వివరించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యాలను తెలిపారు. ఈ పర్యటనలో పలు సంస్థలతో ఒప్పందాలు కుదరగా మరికొన్ని సంస్థలు పెట్టుబడులకు ఆసక్తిని వ్యక్తీకరించాయి.