మన్మోహాన్ సింగ్ అంత్యక్రియలకు హాజరుకానున్న బీఆర్ఎస్ ..!
భారత మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బిఆర్ఎస్ పార్టీ హాజరై ఘన నివాళులర్పించనున్నది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కు ఆదేశాలిచ్చారు. అందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బిఆర్ఎస్ పార్టీ ఎంపీల బృందం హాజరుకానున్నది.
ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ మాట్లాడుతూ…‘దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్టు గా మన్మోహన్ సింగ్ గారు దేశానికి అమోఘమైన సేవలందించారు. దాంతో పాటు తెలంగాణకు ప్రత్యేకమైన అనుబంధం మన్మోహన్ సింగ్ గారితో వున్నది. వారి కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన నాకు వారితో వ్యక్తిగత అనుబంధమున్నది. వారెంతో స్థిత ప్రజ్జత కలిగిన దార్శనికులు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా వారందించిన సహకారం తెలంగాణ సమాజం మరువదు.
తెలంగాణ కోసం పోరాడుతున్న నాకు, టిఆర్ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని నింపుతూ వారు అండగా నిలిచారు. వారు ప్రధానిగా వున్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది.రాష్ట్ర ఏర్పాటులో సానుకూల వైఖరితో నాకు వారందించిన సహకారం మరువలేను. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్ సింగ్ గారికి ఘన నివాళులు అర్పించాలని బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. వారి కడసారి వీడ్కోలు సందర్భంగా అంత్యక్రియల్లో పాల్గొనాలని పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ ను ఎంపీలను ఆదేశించాను. ఈ మేరకు వారు హాజరుకానున్నారు,.’’ అని కేసీఆర్ తెలిపారు.