బ్లేమ్‌ గేమ్‌ బూమరాంగ్‌ అవడం ఖాయం

 బ్లేమ్‌ గేమ్‌ బూమరాంగ్‌ అవడం ఖాయం

చరిత్రను అర్థం చేసుకోగలిగితే ఏ రంగంలోని వారికైనా చూపుడు వేలుగా మారుతుంది. మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, నేతలకు పరిపక్వతతో పాటు, శాస్త్రీయ పాలనా విధానాల అవగాహనకు కూడా దోహదపడుతుంది. కానీ, దురదృష్టవశాత్తు గాలికి ఎగిరొచ్చి తలపై వాలిన కిరీటం కొందరిని కిందకు చూడనివ్వదు. వాస్తవానికి ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రజా రాశుల మదిలో ఆరాధనా భావన కలిగిన నేతల వ్యక్తిత్వ హనన యత్నాలు రాజకీయాలలో కొత్త వ్యూహాలేం కావు.

ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశ రాజకీయ చరిత్రలో చాలామంది ప్రముఖ నాయకులపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. వారిలో కొందరు ముఖ్యుల మీద మోపిన నిందలపై విచారణలు సైతం జరిగాయి. నెహ్రూ ప్రభుత్వం తీసుకొచ్చిన 1952 విచారణ కమిషన్ల చట్టం మేరకు ఇందిరాగాంధీపై కూడా విచారణ జరిగింది. అయితే వివిధ కమిషన్ల విచారణ తీరు, వాటి నియామకం వెనుక ఆయా ప్రభుత్వాధినేతల ఉద్దేశాల నిరూపణ లక్ష్యం పరిధిని ధాటి, చట్టం స్ఫూర్తిని ప్రదర్శించే దిశగా సాగలేదని అధ్యయనం చేస్తే ఎవరికైనా అర్థమవుతుంది.

నిందారోపణలు, కమిషన్‌లు, విచారణలు విలువైన నాయకత్వాల ప్రతిష్టను వధిస్తాయని ఏ పాలకుడైనా భ్రమపడితే అవివేకమే అవుతుందని గతం మనకు చెప్తున్నది. కానీ, గతంలోకి తొంగిచూసి, వర్తమానం విలువను అర్థం చేసుకొని, భవిష్యత్తులో కూడా ఉపయోగంలో ఉండే వ్యక్తిత్వం అందరు నాయకులకు ఉంటుందని ఆశించలేం కదా! అందులోనూ రాజకీయ అబ్రకదబ్ర విద్యను మాత్ర మే విశ్వసించే సీఎం రేవంత్‌ నుంచి ఆ పరిణతి కోరుకోవడం విడ్డూరమే అవుతుంది. వాస్తవానికి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముందు పెద్ద సవాల్‌ ఉన్నది. ఏం చేసినా తెలంగాణ చరిత్రలో కేసీఆర్‌ నమోదు చేసుకున్న అద్భుత స్థానాన్ని అందుకోవటానికి ఆస్కారం లేనే లేదు. అలాగే పదేండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనా విధానాలకు పది పైసలు జోడించే వెసులుబాటు ఉంది కానీ, భిన్నమైన పథకాలతో నూతన చరిత్రను లిఖించే అవకాశం హస్తం పార్టీ ప్రభుత్వానికి కనిపించడం లేదు. దీంతో రేవంత్‌ రెడ్డి కూడా పాత రోత నీతినే నమ్ముకున్నారు. ఆ ఆలోచల్లో భాగంగానే నీళ్లలో నేరం నమోదు చేసేందుకు, కరెంట్‌ వెలుగులపై అవాస్తవాలను ఆరేసేందుకు కుట్రాచారం ఆచరణలో పెడుతున్నారు.

చరిత్ర నిర్మించే చేవ లేనప్పుడు, చారిత్రక పురుషుల కార్యాలను వెక్కిరింతల పాల్జేయాలనే విషపు ఎత్తుగడ కొత్తదేం కాదు. శకుని మామ వారసులు ఎందరో ఆ విద్యను ఆచరణలో పెట్టారు. ఆ రాతియుగపు వికృత వ్యుహమైన విజేత విలువను వధిస్తే, కనీ సం దింపుకొని, వీరులను తమ వరుసలోనే కూర్చోబెట్టుకోవచ్చుననే దుర్బుద్ధి కొందరు విఫల పాలకుల కు ఉండింది. అదే ధోరణిని నేడు రాష్ట్ర సర్కార్‌ పెద్దలు ప్రదర్శిస్తున్నారు. కానీ, బ్లేమ్‌ గేమ్‌ బూమరాంగ్‌ కావడమన్నది దేశ రాజకీయాల్లో చారిత్రక సత్యమే కదా! కాళేశ్వరంపై, కరెంట్‌పై, గొర్రెల పంపిణీ పథకంపై ఇం కా ఎన్ని కమిషన్‌లు వేసే యోచన రేవంత్‌ రెడ్డి సర్కార్‌కు ఉన్నదో తెలియదు గానీ, అన్నీ విఫల యత్నాలై, తెలంగాణ చరిత్రే విజయం సాధించడం ఖాయం. అసాధ్యమని దేశమే నమ్మిన ప్రత్యేక రాష్ర్టాన్ని జనం అనుభవంలోకి తెచ్చిన, అద్వితీయ పాలనా విజయాలను పదేండ్లలో ప్రజలకు పంచిన కేసీఆర్‌ను పలుచన చేయాలనే పాచికలు పారవు.

పాలకుల కంటే ప్రకృతి గొప్పది. శ్రమకు తలవంపులు తెచ్చే ఏ చర్యనూ పంచభూతాలు అంగీకరించవు. శ్రమను శ్రమతోనే జయించగలరు గానీ దాని దివ్యత్వాన్ని ఏ ఎత్తులతోనో మలినపరచడం అసాధ్యం. తెలిసో, తెలియకో, కుర్చీ కల్పించిన వక్రత్వం ఆవహించిన పరవశంలోనో రేవంత్‌రెడ్డి లాంటి పాలకులు శ్రమకు పంగనామాలు పెట్టే పని ముందేసుకుంటారు. వివక్ష, వంచనకు తరాలకు తరాలు వేలాడిన తెలంగాణను, త్వరితగతిన ఒడ్డున పడేసే సత్సంకల్పంతో సాగిన కేసీఆర్‌ ప్రభుత్వ పనులపై ఉద్దేశపూర్వక వికృత లక్ష్యంతో విచారణాపర్వం నడిపించడం వివేకమవుతుందా? అసలు కేసీఆర్‌ సర్కార్‌పై మోపిన అత్తెసరు ఆరోపణలపైనే కాదు, దేశంలో మహా నేరారోపణలపై నడిచిన కమిషన్‌ విచారణలు కూడా న్యాయ పరీక్ష ముం దు ఓడిపోయాయి.

1971-76 మధ్యకాలంలో నాటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అక్రమాలకు పాల్పడ్డారని ఎంజీఆర్‌ తదితర నేతలు చేసిన ఫిర్యాదులపై ఎమర్జెన్సీ సమయంలోనే రంజిత్‌ సింగ్‌ సర్కారియా కమిషన్‌ విచారణ చేపట్టింది. అలాగే ఎమర్జెన్సీ సమయంలో ఇంధిరాగాంధీ సర్కార్‌ అనేక అకృత్యాలకు పాల్పడిందనే ఆరోపణలపై సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జయంతిలాల్‌ ఛోటాలాల్‌ షా కమిషన్‌ను నాటి జనతా సర్కార్‌ నియమించి, విచారణ జరిపింది. రాజ్యాంగ ఉల్లంఘనలు, అక్రమ అరెస్టులు, అవినీతి, హత్యలు తదితర తీవ్ర నేరారోపణలపై పాటియాల హౌస్‌లో జరిగిన షా కమిషన్‌ విచారణతో పాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాలలో వందలాది కేసులు మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై నమోదయ్యాయి. చివరికి ఈశాన్య రాష్ర్టాలలో ఆ సమయంలో జరిగిన కోళ్ల దొంగతనం కేసు కూడా మాజీ ప్రధానమంత్రిపై నమోదైంది. షా కమిషన్‌ విచారణే కాదు, దేశంలోని అనేక న్యాయస్థానాల్లో జరిగిన విచారణను ఇందిరాగాంధీ ఎదుర్కొన్నారు. ఆ పరిణామాలన్నీ ఆమెపై సానుభూతిని పెంచి, ఆరాధనాభావం మళ్లీ పెరగడానికి దారితీశాయి. జస్టిస్‌ షా కమిషన్‌ విచారణ సందర్భంగా ఇందిరాగాంధీ స్వయంగా కోర్టుకు ఇలా చెప్పుకొచ్చారు. ‘కొన్ని సదుద్దేశ ప్రభుత్వ విధానాలు కొన్ని సందర్భాల్లో వివాదాస్పదం కూడా కావొచ్చు.

కానీ, వాటిని తదుపరి ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలకు వినియోగిస్తే ఆ తర్వాతి కాలంలో వచ్చే ప్రభుత్వాలు అసలు విధాన నిర్ణయాలు తీసుకోవటానికే జడుసుకుంటాయి. రాబోయే ప్రభుత్వాలు రంధ్రాన్వేషణ చేసి, విచారణ జరిపించగలవనే భయం ఏ ప్రభుత్వ విప్లవాత్మకమైన ఆలోచనలనైనా పురిట్లోనే చంపేస్తుంది’ అని ఇందిరాగాంధీ తన తరపున తానే వాదనలు వినిపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీపైనే కాదు, దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీపై వచ్చి న బోఫోర్స్‌ కుంభకోణం ఆరోపణలు అనేక సంవత్సరాల పాటు దేశ రాజకీయ రంగంలో తీవ్ర చర్చ ను రగిలించింది. అలాగే పీవీ నరసింహారావుపై వచ్చిన హర్షద్‌ మెహతా స్టాక్‌ ఎక్సేంజీ స్కాం, జేఎంఎం ముడుపుల కేసు విచారణతో పాటు బాబ్రీ మసీదు కూల్చివేత కుట్రకూ సహకరించారన్న ఆరోపణలు అప్పట్లో భగ్గుమన్నాయి. వాటన్నింటిపై జరిగిన విచారణలు దేశంలో నాడు అనేక అంశాలను చర్చకు పెట్టాయి. ఈ వివాదాలన్నింటిపై ‘అయోధ్య 6 డిసెంబర్‌ 1992’ అనే తన స్వీయ రచనలో విషాదానికి ఒక వ్యక్తిని బాధ్యుడిగా చూపిస్తున్న వారే.. ఒకవేళ విజయం సాధించి ఉంటే ఘనతను దక్కించుకునేందుకు వెంపర్లాడేవాళ్లు అంటూ సొంత పార్టీ నేతల వ్యక్తిత్వం గురించి పీవీ విమర్శించారు. నిజమే విజయాలను అనుభవించేందుకు, ఘనకీర్తికి బాధ్య త వహించేందుకు ఉబలాటపడే వైయక్తిక సమూహమైనా, సమాజమైనా ఊహించని విషాదానికి ఏ ఒక్కరినో బలి పశువును చేయడానికి ఏ మాత్రం సంకోచించరు. ఈ వింత ధోరణికి రాష్ట్ర ప్రస్తుత సర్కార్‌ నిలువుటద్దం.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో మంత్రులు తుమ్మల, భట్టి, ఉత్తమ్‌ తదితరులు ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ఛాంపియన్‌ అని కొనియాడారు. ఇతర వ్యవసాయ, సాగునీటి రంగాల విజయాలను ఘనంగా చాటి చెప్పుకొన్నారు. అలాగే రాష్ట్ర ఐటీ ఎగుమతులు, పెట్టుబడులకు గల అవకాశాలు తదితర తెలంగాణ
ఘనతల గురించి ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికాలో అద్భుతంగా ఆవిష్కరించారు. మరి ఈ విజయతీరాలను తెలంగాణ చేరుకోవడం వెనుక కేసీఆర్‌ ప్రభుత్వం పడ్డ కష్టాన్ని మాత్రం గుర్తించరెందుకు? కేసీఆరే కాదు, ఏ పాలకుడూ ఊహించని సంఘటన కాళేశ్వరంలో జరగగానే.. రాష్ర్టాన్ని ధాన్యాగారంగా తీర్చిదిద్దిన కేసీఆర్‌ను శిలువకు వేలాడదీసేందుకు పోటీ పడుతున్నారు. ఈ మానసిక స్థితి పాలకులకు ఏ విధంగానూ శోభనివ్వదు.

పైన పేర్కొన్న కరుణానిధి, ఇందిర, రాజీవ్‌, పీవీలతో పాటు అనేకమంది ప్రముఖ నాయకులపై ఆరోపణలు వచ్చాయి. వాటిపై విచారణలూ జరిపించారు. దేశ మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీపై హవాలా స్కాం, మాజీ రక్షణశాఖ మంత్రి జార్జ్‌ ఫెర్నాండెజ్‌పై కార్గిల్‌ శవ పేటికల కుంభకోణం ఆ కోవలోనివే. అం తెందుకు నేటి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాలపై గోద్రా సంఘటనానంతర అల్లర్లను ప్రోత్సహించారనే ఆరోపణలపై కూడా కమిషన్‌ విచారణలు జరిగాయి. ఇప్పటి కేంద్ర, రాష్ట్ర సర్కార్‌లపై కూడా అనేక అవినీతి అరోపణలు చర్చలో ఉన్నాయి. అయినా ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ, కరుణానిధి, అద్వానీ, పీవీ తదితర మేరునగధీరులైన చారిత్రక నేతల ఔన్నత్యాన్ని కమిషన్‌లు, విచారణలు తగ్గించగలిగాయా? ఆ మాటకొస్తే దేశంలో మాజీ ప్రధానమంత్రులపై వచ్చిన ఆరోపణలలో కేసీఆర్‌పై వచ్చినవి ఏపాటివని? ఇలా రాజకీయ వ్యవస్థలో దుర్మార్గకర ధోరణి బలపడుతూ, దేశంపై పట్టుకూ అదే అన్యాయమైన పావులు కదుపుతున్నారు. జాగ్రత్తగా పరిశీలిస్తే.. దేశ రాజకీయాల్లో రాష్ర్టాల అస్తిత్వ, ఆత్మగౌరవ రాజకీయాలను పాతరేయాలనే జాతీయపార్టీల వ్యూహలు కూడా మనకేం భిన్నంగా గోచరించవు. నేతల వ్యక్తిత్వాల హననంతో ప్రాంతీయ పార్టీల పీక నొక్కి వేయాలనే ప్రణాళికలు 1980ల తర్వాత దేశ రాజధాని కేంద్రంగా అమలవుతున్నవే కదా! సాధ్యపడితే ఆయా రాష్ర్టాల్లో తమ పార్టీ ప్రభుత్వాలతో, లేకపోతే ఢిల్లీ పెద్దల ఎత్తుగడలతో ఆత్మగౌరవ, అస్తిత్వ రాజకీయ భావజాలాల వధకు వేగం గా పావులు కదుపుతూనే ఉన్నారు.

డీఎంకే, అన్నాడీఎంకే, శివసేన, ఎన్సీపీ,బీఆర్‌ఎస్‌ ఇలా బలమైన ప్రాంతీయ రాజకీయ నాయకత్వాల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్‌ పొలిటికల్‌ హంట్‌ను హస్తం, కమలం పార్టీ ప్రభుత్వాలు అమలుపరుస్తూనే ఉన్నాయి. దీనివెనుక రెండు జాతీయపార్టీల విస్తరణ ఉన్మాదమే కాదు, దేశ సహజ వనరులను కొల్లగొట్టేస్తున్న బహుళజాతి కంపెనీల హస్తం కూడా ఉన్నది. ఆయా రాష్ర్టాల సహజ వనరుల రక్షణ, ఆత్మగౌరవం, అభివృద్ధి మాత్రమే లక్ష్యంగా కలిగిన ప్రాంతీయ పార్టీలు మనుగడలో ఉం టే వాటిని సొమ్ము చేసుకోవడం అంత సులభంగా జరిగే పని కాదని ఆ రెండు జాతీయపార్టీల సావుకారు దోస్తులకు బాగా తెలుసు. అందుకే వారి వెనుక ఉండి వీలైతే బ్లేమ్‌ గేమ్‌తో, కాకపోతే చీల్చే స్కాంతో ప్రాం తీయ రాజకీయ శక్తులను నిర్వీర్యం చేసే కుయుక్తులు పన్నుతున్నారు.

ప్రాంతీయ పార్టీలను ఒకడు కొడితే మరొకడు ఓదార్చే క్రీడతో వంతుల వారీగా ఏమారుస్తున్నారు. కానీ, కాంగ్రెస్‌, బీజేపీలు కుట్రలతో ఏ ఆత్మగౌరవ రాజకీయ శక్తిని కూడా నిర్మూలించలేకపోయారని చరిత్ర మనకు గుర్తుచేస్తున్నది. అవినీతి ఆరోపణాస్ర్తాలతోనో, అణచివేత విధానాలతోనో, తాయిలాల గాలాలతోనో ప్రాంతీయ ఆకాంక్షలను దేశ రాజకీయ పెత్తందారులు సమాధి చేయలేకపోయారు. ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ డీఎంకే, శివసేన, ఎన్సీపీ, ఆర్జేడీ, ఎస్పీ, ఎల్జేపీ తదితర ప్రాంతీయ రాజకీయ శక్తులు తమ పూర్వ వైభవాన్ని తిరిగి దక్కించుకున్నా యి. బీఆర్‌ఎస్‌ కూడా తెలంగాణ నేలతల్లి కన్న బిడ్డ. రాష్ట్రం ఎంత వాస్తవమో గులాబీ జెండా కూడా అంతే శాశ్వతం.

నిజానికి తెలంగాణ ఆవిర్భావం నాటికి పలువురు పాపాల భైరవుల చిట్టా కండ్లముందే ఉన్నది. ఐఎంజీ భూముల స్కాం, ఇందిరమ్మ ఇండ్ల కుంభకోణం, ప్రాజెక్టుల అడ్వాన్స్‌ మొబిలైజేషన్ల గోల్‌మాల్‌, ఫేక్‌ ఎన్‌కౌంటర్లు ఇలా ఎన్నో అక్రమాల సమాచారం నాటి తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్నది. కేసీఆర్‌ ప్రభుత్వం కూడా కాంగ్రెస్‌ పార్టీ సర్కార్‌లా ఆలోచించి ఉంటే ఎందరో సుద్దపూసలు ఊచలు లెక్కబెట్టేవారు. కానీ, గత ప్రభుత్వాల విధానాలపై రంధ్రాన్వేషణ కోసం ఒక్క సెకన్‌ సమయం కూడా కేసీఆర్‌ సర్కార్‌ వృథా చేయలేదు. ప్రతి నిమిషం తెలంగాణ ప్రగతి కోసమే వెచ్చించి చెమటోడ్చింది. దానివల్లనే స్వరాష్ట్రం విఫల రాష్ట్రంగా మారుతుందని ఆశించిన వారి కండ్లు బైర్లు కమ్మేలా అద్వితీయమైన విజయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా తెలంగాణ ఎదిగింది.

మానసిక మరుగుజ్జుల ఉచ్చు నుంచి బయటపడ్డ తెలంగాణ.. విజ్ఞుడి ఏలుబడిలో నిలబడి గెలిచింది. అలాంటి తెలంగాణను పగలకు, విలువల్లేని విధానాలకు నిలయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్చేసే ప్రయత్నం చేస్తున్నది. కేసీఆర్‌ ప్రతిష్టను తగ్గించే పనిలో తెలంగాణ చరిత్ర చేతులు విరగ్గొట్టే విధానాలు అమలుచేయడం న్యాయమా? రైతులు, బడుగుల భవిష్యత్తు కోసం కేసీఆర్‌ ప్రభుత్వం అమలుచేసిన ప్రతి పథకానికి మలినం పూసే పద్ధతి చివరికి ప్రజలకు భారీ నష్టం చేస్తుంది.

విచిత్రమేమంటే చివరికి లక్షల మంది అట్టడుగు వర్గాల పిల్లలకు భద్రమైన భవితను వాగ్దానం చేసిన గురుకులాలనూ నిర్వీర్యం చేసే దిశగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతుండటం ఆవేదనాభరితం. గురుకులాల వసతి గృహ విద్య తల్లిదండ్రులతో అనుబం ధాన్ని చంపేస్తున్నదని స్వయానా సీఎం సెలవివ్వడం ఎంతటి దుర్మార్గం? కనీసం గురుకుల విద్యావ్యవస్థ చరిత్రను తెలుసుకోకుండా బోధి వృక్షాల్లాంటి వాటిని సైతం నేలమట్టం చేసే దిశగా కాంగ్రెస్‌ సర్కార్‌ అడుగులు పడుతున్నాయి.

విచారణలు, కమిషన్‌లు, చర్యలు, ప్రభుత్వ వైఫల్యాలే మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెడతాయి. రేవంత్‌రెడ్డి సర్కార్‌తో పాటు దేశం, రాష్ట్రంలో బీజేపీ వేగంగా ప్రజా విశ్వాసాన్ని కోల్పోవడం ఖాయం. ప్రభావిత సమాజం ఆసరాగా రాకపోతే మౌత్‌ టూ మౌత్‌ క్యాంపెయిన్‌ను నమ్ముకొని అమెరికా అధ్యక్షుడిగా నెగ్గిన అబ్రహాం లింకన్‌ పంథాను గులాబీ దళం సభ్యులైన మనం ఇప్పుడు అనుసరించాలి. మెజారిటీ మీడియా, రాజకీయ పెత్తందారీవర్గ మేనియా ఎటువైపున్నదో తేటతెల్లమైంది. కార్యకర్తలమే కార్యశీలురమై రాష్ట్ర ఆత్మగౌరవ పరిరక్షణ పోరును ఊరూరా మండిద్దాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఇరిగేషన్‌ సలహాదారే కాదు, హస్తం ఇండ్లు నడిపిస్తున్నదీ ఎవరో బుద్ధిజీవులందరికీ తెలిసిన సత్యమే. తెలంగాణకు గులాబీ జెండా శాశ్వత అవసరం. ఆ వెలుగులోనే ‘ఎత్తిన జెండా దించమోయ్‌.. గులాబీ జెండాకు జై’ అంటూ నినదిద్దాం. సూర్యుడిని మబ్బులతో దాచేయాలనుకోవడం ఎంత అవివేకమో, చారిత్రక నేతలను ప్రజల్లో పలుచన చేయలనుకోవడం కూడా అంతే అజ్ఞానం. మళ్లీ జనం జైత్రయాత్రగా బీఆర్‌ఎస్‌ ప్రభంజనం ఖాయం.

-డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌

(వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ మాజీ చైర్మన్‌)

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *