గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ..?
కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఒక తానుముక్కలేనా…?. గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో గిల్లిగిచ్చాలు పెట్టుకుంటాయా..?. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ హౌజ్ (లోక్ సభ) రాహుల్ గాంధీ నిత్యం లేస్తే మోదీ & టీమ్ పై విమర్శల బాణం ఎక్కుపెడతారు. తెలంగాణలో మాత్రం అదే పార్టీకి చెందిన నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఒక్క మాట కూడా అనరు.. అడగరు. కానీ అదే బీజేపీ కి చెందిన ఎంపీ.. కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్ధతుగా మాట్లాడ్తారు. ఆ పార్టీకి చెందిన మంత్రులపై ప్రశంసల వర్షం కురిపిస్తారు.
అసలు బీజేపీ కాంగ్రెస్ ఒకటేనా..? . అంటే తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలపై బీజేపీ నేతలు మాట్లాడరు.. 420హామీల గురించి ఊసే ఎత్తరు. రైతు రుణమాఫీ చేయాలని రైతులంతా రోడ్లపైకి వస్తే కనీసం ప్రెస్ నోట్ కూడా విడుదల చేయరు ఆ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షులు .. కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి. హైడ్రాతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలంతా రోడ్లపైకి వచ్చి తమకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతూ ధర్నాలు.. రాస్తోరోకులు చేస్తే కయ్యమనరు..
గ్రూప్ -1లో తమకు అన్యాయం జరుగుతుందని ఆశోక నగర్ లో నిరుద్యోగ యువత ఆహర్నిశలు ధర్నాకు కూర్చున్న చలించలేదు. అఖరికి బెటాలియన్ పోలీస్ కుటుంబాలు సచివాలయం ముట్టడి చేసిన దాని గురించి శోచించరు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దించాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది.. కాంగ్రెస్ పాలన బాగుంది. పదేండ్లలో అందుబాటులో లేని మంత్రులు పది నెలల్లో ప్రజలతో పాటు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటారని ఏకంగా కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశంసిస్తారు. అంటే కాంగ్రెస్ బీజేపీ గల్లీలో ఒకటే.. ఢిల్లీలో మాత్రమే కుస్తీ పడతాయని చెప్పకనే చెబుతున్నారు అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.