ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు..!

తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే అత్యంత పారదర్శకంగా జరిగిందని, కులగణన సర్వేను మళ్లీ చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సమాజం క్షమించదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు సోమవారం రోజున భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అవగాహన సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు.
అంతకు ముందు మొగుళ్లపల్లి ఎంట్రన్స్ లోని రావి చెట్టు నుండి బస్టాండు సెంటర్ వరకు కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించగా, ఆ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే పారదర్శకంగా జరిగిందని అన్నారు. కులగణన సర్వేను మళ్లీ చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సమాజం క్షమించదని ఎమ్మెల్యే అన్నారు.
2014లో భారాసా సమగ్ర కుటుంబ సర్వే చేసి కనీసం ఆ లెక్కలను కూడా బయటకు చెప్పలేని, ఇప్పుడు మాట్లాడటం సిగ్గుచేటని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే భరించలేక కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే అన్నారు. ఎంతో శాస్త్రీయంగా ప్రభుత్వ సిబ్బందిని పెట్టి ఇంటింటికి తిరిగి పరిశీలించి వివరాలు సేకరించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారాస – బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధ్యమైనంత మేరకు ఎక్కువ స్థానాలు ఏకగ్రీవం అయ్యేలా కృషి చేయాలని నేతలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు గ్రామాలలో కలిసికట్టుగా పనిచేయాలని, వర్గాలుగా విడిపోయి గ్రామాలల్లో ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే అన్నారు.
