ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి..?
తెలంగాణ రాష్ట్రంలో నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబులు పాల్గొన్నారు.
జాయింట్ వెంచర్స్ లో విలువైన ఆస్తులు ఉన్నాయి, ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకు వెళ్లి వివాదాలు సృష్టిస్తున్నారు. ఈ అంశంపై నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. కాలుష్యం సమస్య ఉన్న పరిశ్రమల నిర్వాహకులు తాము నగరం విడిచి ఔటర్ రింగ్ రోడ్డు బయటకు వెళ్తామని సబ్ కమిటీకి విజ్ఞప్తులు చేశారు. పరిశ్రమల యజమానుల విజ్ఞప్తులు పరిశీలించి వారు ఓ ఆర్ ఆర్ బయట పరిశ్రమలు స్థాపించి ముందుకు వెళ్లేలా సహకరించి, పరిశ్రమలను ప్రోత్సహించాలని, హైదరాబాద్ నగరంలో జీరో కాలుష్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ అధికారులను సబ్ కమిటీ సభ్యులు ఆదేశించారు.
మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రెగ్యులర్ గా జరుగుతున్న ప్లాట్ల బహిరంగ వేలం ప్రక్రియపై సబ్ కమిటీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంది. ముందుగా కొంత భాగాన్ని వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు గరిష్ట ఆదాయం సమకూరేలా ముందుకు వెళ్లాలని గృహ నిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు.