రేవంత్ రెడ్డి కంటే భట్టీ బెటర్…!
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి కంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బెటర్ అని రాజకీయ విశ్లేషకులతోపాటు కాంగ్రెస్ క్యాడర్ కూడా భావిస్తున్నది. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇది నిరూపణ అయిందని వారు భావిస్తున్నారు. మహారాష్ట్రలోని మరఠ్వాడ, విదర్భ ప్రాంతాలకు సీఎం రేవంత్‌రెడ్డిని స్టార్ క్యాంపెయినర్‌గా విఫలమవగా, జార్ఖండ్‌లో ఏఐసీసీ అబ్జర్వర్‌గా భట్టి విక్రమార్క సక్సెస్‌ను అందుకున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
వేదికలపైన అట్టహాసం, ఊకదంపుడు ఉపన్యాసాలతో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కూటమిని భ్రష్టు పట్టించారని, భట్టి విక్రమార్క మాత్రం క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలను ఎప్పటికప్పుడు అధిష్ఠానంతో సమన్వయం చేసుకుంటూ జేఎంఎం కూటమిని విజయ తీరాలకు చేర్చడంలో కీలక భూమిక పోషించారని అంటున్నారు. మహా వికాస్ అగాడీ తరఫున ఎన్నికల ప్రచార బరిలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వ హెలికాప్టర్‌ను వినియోగించుకుంటూ మహారాష్ట్రలో చక్కర్లు కొట్టారు. తెలంగాణ ఓటర్లు పెద్ద సంఖ్యలో స్థిరపడిన జిల్లాల్లోనే ఆయన పర్యటించారు. రోడ్ షోలు, బహిరంగసభలు నిర్వహించారు.
మహా వికాస్ అగాఢీ అభ్యర్థులతో కలిసి ముమ్మర ప్రచారం సాగించారు. కానీ మహారాష్ట్రలో ఆ కూటమికి రేవంత్‌రెడ్డి ఓటమిని మూటగట్టించారని అసంతృప్తి రగులుతున్నది.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్‌గా కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 44 సీట్లు కావాల్సి ఉన్నది. కాంగ్రెస్, జేఎంఎం కూటమి 55 స్థానాలు గెలుచుకున్నది. ఈ విజయం వెనుక భట్టి విక్రమార్క వ్యూహాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
అట్టహాసాల కంటే క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అంచనా వేయడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని, క్షేత్రస్థాయి సమస్యలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఎత్తులు, పైఎత్తులు ఇతర అంశాలను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో సమన్వయం చేసుకుంటూ.. కిందిస్థాయిలో అమలు పరిచారని వారు చెప్తున్నారు. అభ్యర్థుల ఎంపిక, జేఎంఎంతో పొత్తులు, సీట్ల సర్దుబాటు, ఇతర అంశాలపై పార్టీ సీనియర్ నేతలతో చర్చించి అధిష్ఠానాన్ని ఒప్పించడంలో భట్టి సక్సెస్ అయ్యారని అభిప్రాయపడ్డారు. పోలింగ్ శాతాన్ని పెంచడంపై భట్టి ప్రత్యేక ప్లాన్ కాంగ్రెస్, జేఎంఎం కూటమి గెలుపునకు దోహదపడిందని చెప్తున్నారు.