దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు అసెంబ్లీ నివాళి
కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు సాయన్న గారి కుటుంబం చేసిన సేవలు మరువలేనివని, జనం గుండెల్లో ఆ కుటుంబానికి శాశ్వత స్థానం ఉంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు.
కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సాయన్న గారి అకాల మరణానికి చింతిస్తూ శాసనసభలో మంగళవారం సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానంపై మాట్లాడుతూ సాయన్న గారి కుటుంబంతో సుదీర్ఘ అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు.
సాయన్న గారి మరణం తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత సాయన్న గారు 2024 ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో మరణించడం తనను కలిచివేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, ఆ ప్రాంతం జీహెచ్ఎంసీలో విలీనమవుతోన్న ప్రస్తుత సందర్భంలో సాయన్న గారు, వారి కూతురు లాస్య నందిత గారు మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి అన్నారు. సాయన్న కుటుంబం ఆశయాలను ముందుకు తీసుకెళతామన్నారు.లాస్య నందిత సాయన్న గారి మృతిపై సంతాప తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.