మళ్ళీ అధికారం బీఆర్ఎస్ దే

 మళ్ళీ అధికారం బీఆర్ఎస్ దే

రెండున్నర దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవని, తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని, ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను మరింతగా పొందుకుంటూ ముందడుగు వేస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు.

తెలంగాణ అస్థిత్వమే ప్రమాదంలో పడిన దిక్కు మొక్కు లేని చివరిదశ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన అటునుంచి పదేండ్ల ప్రగతి పాలన దాకా తాను ఎదుర్కున్న కష్టాలను కేసీఆర్ గారు ఈ సందర్భంగా కార్యకర్తలకు వివరించారు.

ఆనాడు తెలంగాణను అష్ట దిగ్భందనం చేసిన సమైక్యవాద శక్తులు, వారి మీడియాతో సహా సమస్త రంగాలు.. వాళ్లు రాసిందే రాత గీసిందే గీత’గా నడిచేదని గుర్తుచేశారు. అత్యంత శక్తివంతమైన ఆంధ్రా వ్యవస్థలను తట్టుకుంటూ, తెలంగాణ వ్యతిరేకతకు, సమైక్య వాదానికి సింబాలిక్ గా ఉన్న నాటి పాలకుడు చంద్రబాబు నాయుడును ఎదిరించి నిలవడం అంటే అషమాషీ వ్యవహారం కాదని అన్నారు. అటువంటి సమైక్య వాద కుటిల వ్యవస్థలనే బద్దలుకొట్టి తెలంగాణను సాధించి, కలబడి నిలబడిన తెలంగాణ సమాజం, భవిష్యత్తులో ఎటువంటి ప్రతిబంధక పరిస్థితిలనైనా అధిగమిస్తుందని కేసీఆర్ భరోసా వ్యక్తం చేశారు.

గెలుపు ఓటములకు అతీతంగా తెలంగాణ సమాజం మనకు ఎల్లవేళలా అండగా ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందని కార్యకర్తల జై తెలంగాణ నినాదాల నడుమ కేసీఆర్ ప్రకటించారు.

శత్రువుల ప్రత్యర్థుల కుటిల యత్నాలను అధిగమిస్తూ అప్రతిహతంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో నిన్నటి ఓటమితో దిష్టి తీసినట్టయిందని, తిరిగి పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణను కూడగట్టాలని కార్యకర్తల హర్షధ్వానాల నడుమ కేసీఆర్ ప్రకటించారు.

ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రేస్ పార్టీ, ఇచ్చిన అలవిగాని హామీలు అమలు చేయడం చేతగాక పలురకాల జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నదని దుయ్యబట్టారు. కాంగ్రేసు పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు, ఓటేసి పొరపాటు చేసినామని నాలిక కరుసుకుంటున్నారని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో మున్నెన్నడూ లేనివిధంగా ప్రశాంతమైన పాలన ద్వారా పదేండ్లపాటు సంక్షేమం అభివృద్ధిని అందిస్తూ అన్ని తీర్లా అండగా నిలబడ్డ బీఆర్ఎస్ పార్టీని తిరిగి తెలంగాణ సమాజం కోరుకుంటున్నదని కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్ మీద ద్వేషంతో, అసంబద్ధ ప్రకటనలతో, ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా నడస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరుగబడే రోజులు త్వరలోనే రానున్నాయని స్పష్టం చేశారు. తన చేష్టలతో తానే ప్రజలచేత ఛీ కొట్టించుకోవడమే యాబై ఏండ్ల కాంగ్రేస్ వైఖరి అనీ, ఈ నేపథ్యంలో ప్రజలు అనతికాలంలోనీ కాంగ్రేస్ పాలనపై విరక్తి చెందారనే విషయం క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నదని సోదాహరణలతో కేసీఆర్ వివరించారు.

“మరికొద్ది రోజుల్లోనే టార్చ్ లైట్ పట్టుకొని జనం దోలాడుకుంటా బీఆర్ఎస్ పార్టీకోసం వస్తారని” కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేస్తూ, అప్పడిదాక ఓపికతో ప్రజా సమస్యలపైన పోరాడుతూ వారికి అందుబాటులో వుండాలని కార్యకర్తలకు అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు.

బుధవారం నాడు ఎర్రవల్లి నివాసంలో తనను కలిసేందుకు మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నుండి వచ్చిన కార్యకర్తలు నాయకులతో కేసీఆర్ గారు సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో నల్గొండ తదితర జిల్లాల మాజీ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
వారిలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తక్కెళ్ల పల్లి రవీందర్ రావు,కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, జీవన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీతా రెడ్డి, నలమోతు భాస్కర్ రావు, రమావత్ రవీంద్ర కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్, బూడిద బిక్షమయ్య గౌడ్ మరియు కంచర్ల కృష్ణారెడ్డి, తిప్పన విజయసింహా రెడ్డి, ఒంటెద్దు నర్సింహరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *