దారి తప్పిన దసరా…?

 దారి తప్పిన దసరా…?

Loading

దసరా పండుగ అంటే ఒకప్పుడు నెలరోజుల సందే ఎదురుసూస్తుంటిమి. ఎట్లన్నజేశి పిల్లలకు కొత్త బట్టలు పిట్టియ్యాలని అమ్మనాయ్నల తొక్కులాట. పక్కూరు కెల్లి సైకిల్ మీద బట్టల మూటతో శాలొల్ల బిచ్చపతి మామ వస్తుండే. మామ అట్లైతడంటే.. మా నాయ్నను బావ అని పిలుస్తుండే. కులాలు లేని ఓయ్ అనుకునే బంధం. మూట ఇప్పి అరుగు మీద పెట్టి.. ఒక్కొక్కటి ఇప్పి సూపిస్తుండే. అదే పే.. ద్ద షాపింగ్ మాల్. నచ్చిన పైంట్.. బుషోట్ బట్ట సూపిత్తే కత్తెరతోటి పర్రున కత్తిరిచ్చి మర్తవెట్టి ఇచ్చేది. అంత ఉద్దేర బ్యొరం. అదనకు ఐదో పదో ఉంటే ఇచ్చేది… లేకుంటే కాపీల రాస్కుంటుండే. పంట కోశినంక మాకు పైసలు చేతికొచ్చినంక వచ్చి తీస్కపోతుండే.

కమ్మరొళ్ల విష్ణు తాత కొలిమికాడికివొయ్యి రోల్ రోకలు, సుత్తి జేపిచ్చి అగ్గిపెట్టెలనో, అబ్రేక్ కాయితంలనో పొటాష్ పోసుకుకొని దగ్గెర పెట్టుకునేది. రోల్ రోకల్ల, సుత్తిల పొటాష్ పోశి.. బండ మీద కొడితే డీమ్ అని పెద్ద సప్పుడొస్తుండే. అవ్వే దసరా బాంబులు. తోక పటాకిల పాకిట్ ఒక్కటి కోనిస్తే.. మా సంబురం.

పది రోజుల ముందే పది షేర్ల బియ్యం పట్టిస్తే.. బాయికాడ పెద్ద పెద్ద మొద్దులు పలగ్గొట్టేది. కట్టెలపొయ్యి మీద పే..ద్ద కడాయి పెట్టి… చెవిల్లలు, అప్పాలు, మిర్చీలు, బొబ్బుడాలు చేస్తుంటే ఆడకట్టంత సుయ్యి సుయ్యి సప్పుళ్లే. నలుగురైదుగురు కల్శి ఓ యాటను కొని..పండుగ నాడు మబ్బుల కోశి పోగులు ఏస్కుంటే ఇంత మెత్తటి కూర, ఇంత బొక్క, తలాయింత బోటి, తల్కాయ కూర వస్తుండే. ఎచ్చం మసాలా రోట్లే నూరి.. కూర వండుతుంటే కమ్మటి వాసన అచ్చేది. ఇంటింటికి కోళ్లేనాయే..కోడి కూర, బగార బువ్వ వండుతుండేది. దసరా పండుగంటే పూరీలు తప్పకుంట చేస్కునేది. అమ్మటాళ్లకు అందరు బంతి కూకున్నంక ఇంత పెద్దలకు పెట్టినంక అందరం కూకోని తింటుంటే అదో తుర్తి.
తాగుడు అంటే ఋల్లే. ఎవలో ఒగలు కోటరు కీసలు, బీర్లు తెచ్చుకునేది. ఆడోళ్లకు థంప్సప్, కొక్కకోలాలు.

దబ్బదబ్బ బర్లను మేపి.. కట్టేశి.. ఇంత గడ్డెశి.. జెప్పున ఇంటికి ఉరుకొచ్చి…కొత్త బట్టలు, ప్యారగన్ చెప్పులేస్కోని..పొద్దంజాలం ఊరంత గూడి జమ్మికి బైలెల్లేది. పాలపిట్టను సూడాలని మొగులంత దేవులాడేది. అగువడితే అదో సంబురం. ఎన్కో ముందో కనవడుతుండే. ఇగ కుల పెద్దలకు బొట్టు, కంకణం అందినంక… యాటను కొట్టేది. జమ్మి చెట్టు సుట్టు తిరిగి పూజలు జేశినంక.. కొమ్మలకు ఎగవడి.. ముండ్లు కోస్తున్న అట్లన దువిషి జేబులేస్కునేది. కులాలతో సంబంధం లేకుంట జమ్మి పెట్టి అలై బలై తీస్కునేది. ఊరికొచ్చినంక అమ్మ నాయ్నలకు.. అటెన్క అక్క చెల్లెండ్లకు జమ్మి వెట్టి.. కాళ్లు మొక్కి దివేనార్తి తీస్కునేది. ఇగ ఇల్లిళ్లు తిరుక్కుంట పెద్దలకు, జమ్మి పెట్టెది. అద్దమ్మ రాత్రిదాకా ఊరంత అదో సంబురం.

మర్నాడు పొద్దుగల్నే బాయికాడ పని జెల్దిన ఒడిపిచ్చుకొని ఇంటికొస్తుంటిమి. ఎందుకంటే దసరా తెల్లారి భోనగిరికి శిన్మకు పోవాలే తప్పకుంట. దోస్తులమంత గూడి.. సైకిళ్లేస్కోని దబ్బ దబ్బ పొయ్యేవొరకు మా కంటే ముందే బొచ్చెడు మంది లైన్ కట్టేది. 5 రూపాలు, 10 రూపాలు, 20 రూపాల టికెట్లు. కింద మీదవడి టికెట్లు దొర్కవట్టేది. ఒక్కటి రొండు తక్వ వడితే.. బ్లాక్ కొనేది. దసరా అంటే ఎంతో సంబురముండే.

కానీ ఇప్పుడు దసరా తొవ్వ తప్పింది. కొత్త బట్టలు కొనుడేమోగని.. చెడ్డిల మీదే తిరుగుడు. దోస్తులు కల్శి పోతుండ్రు జమ్మికి కాదు.. సిట్టింగులకు. బీరు బాటిల్ మీదున్న పిట్టెనే పాలపిట్ట అనుకొని దర్శనం జేస్కుంటాండ్రు. జమ్మికి పోవుడు లేదు.. పాలపిట్టెను సూసుడు లేదు. ఇళ్లిళ్లు తిరుగుడుగాదు ఎదురువడ్డొళ్లకు అలై బలై ఇచ్చుడే మా భాగ్యం. బావుల పొంట సిట్టింగులు… సుక్క ముక్క జంపుడే. మర్నాడు సైన్మలకు పోవుడులేదు…మల్లా సిట్టింగులే. దసరాంటే పిక్క తినుడు.. లోప్క తాగుడైంది. రేపటి రోజుల్ల ఇంకెంత మారుతదో. అందుకే యాదికున్నది కొంత రాశి దాస్తున్న అని సీనియర్ జర్నలిస్ట్ రఘు భువనగిరి తన వాల్ పై ✍️ పోస్టు సారాంశం..దసరా పండుగ రూపురేఖలు మారకముందే అనాదిగా వస్తున్న సంప్రదాయపండుగ ఆచారాలను భవిష్యత్తు తరాలకు అందజేద్దాము..మన పండుగలను కాపాడుకుందాం..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *