గాంధీపై హత్యయత్నంతో పాటు 11 సెక్షన్ల కింద కేసు నమోదు
శేరిలింగంపల్లి శాసన సభ్యులు.. పీఏసీ చైర్మన్ అరికెలపూడి గాంధీపై పోలీసులు హత్యాయత్నం కేసును నమోదు చేశారు. తనను హతమార్చేందుకు ప్రయత్నించారు. తన అనుచరులతో కల్సి తన ఇంటిపై.. నాపై దాడి చేశారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గచ్చిబౌలి పీఎస్ లో పిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి ఇచ్చిన పిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులు ఆయన సోదరుడు సురేష్ బాబు, కుమారుడు పృథ్వీ, మియాపూర్ , అల్వీన్ కాలనీ కార్పోరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , డి. వెంకటేశ్ గౌడ్ తదితర పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. కౌశిక్ రెడ్డి తన పిర్యాదులో ” ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ ఎన్నిక,పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాలపై ఈ నెల పదకొండు తారీఖున విలేఖర్ల సమావేశంలో ప్రస్తావించాను. దీనిపై గాంధీ స్పందిస్తూ తాను బీఆర్ఎస్ లో ఉన్నట్లు ప్రకటించారు. ఇందుకు ప్రతిగా నేను ఇంటీకి వస్తాను. అనంతరం ఇద్దరం కలిసి తెలంగాణ భవన్ కెళ్దాం అని వ్యాఖ్యలు చేశాను.
ఆ తర్వాత రోజు అంటే ఈ నెల పన్నెండో తారీఖున గాంధీ మరో సవాల్ విసిరారు. నేను తన ఇంటికి రాకపోతే తానే నా ఇంటికి వస్తానని. అన్నట్లుగానే ఆయనతో పాటు కాంగ్రెస్ గుండాలు కొండాపూర్ లోని నా నివాసానికి చేరుకున్నారు. ఏకంగా పోలీసుల ముందే నాపై నాఇంటిపై దాడికి దిగారు. నన్ను చంపేస్తానని బెదిరించారు. నా ఇంటిని ధ్వంసం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన ఎమ్మెల్యే గాంధీ, అతని కుమారుడిపై చర్యలు తీసుకోవాలి.. నన్ను రక్షించడంలో విఫలమైన ఏసీపీ సీఐ ఎస్సై లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు. ఈ మేరకు 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.