రైతులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకం అమలుకు సన్నద్ధమవుతోన్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీ అమల్లో భాగంగా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెల్సిందే. దీంతో దీనికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటోంది.
మార్కెట్ నుంచి సేకరించే బడ్జెట్ అప్పులను జూలై, ఆగస్టు నెలల్లో ఎక్కువ మొత్తంలో తీసుకునేందుకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరుతూనే.. భూములను హామీగా పెట్టి తీసుకునే రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకోవద్దంటూ విజ్ఞప్తి చేస్తోంది.
మరోవైపు నెలవారీగా తీసుకుంటున్న బడ్జెట్ రుణాలను ఖజానాలో జమ చేసి పెడుతోంది. ఇప్పటికే రుణమాఫీ పథకం కోసం రూ.10 వేల కోట్ల వరకు ఖజానాలో నిల్వ చేసినట్లు సమాచారం. అయితే రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీని 3 దశలుగా అమలు చేయాలని సర్కారు యోచిస్తోంది. ముందుగా రూ.లక్ష లోపు రుణాలను, తర్వాత రూ.లక్షన్నర లోపు, అనంతరం రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేయాలని భావిస్తోంది.