మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈరోజు(ఆదివారం) హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. టీచర్లు, పుస్తకాలు, దుస్తుల కొరత, వేతనాల చెల్లింపుల ఆలస్యం వంటి సమస్యలు విద్యా వ్యవస్థను పట్టి పీడిస్తున్నాయని అన్నారు. విద్యాశాఖ కూడా సీఎం వద్దే ఉన్న సమస్యల మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన టీచర్లకు, విద్యార్థులకు పాఠశాలకు శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. మధ్యాహ్న భోజన పథకం కింద విధులు నిర్వర్తిస్తున్న 54,201 మంది వంటమనిషి, హెల్పర్లకు ఏడు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న భోజన బిల్లులు, కోడిగుడ్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎస్జీటీల బదిలీల నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పడ్డ సుమారు 9 వేల ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ సరఫరా చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కోరారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తామన్న సిబ్బందిని వెంటనే నియమించాలన్నారు. విద్యార్థులకు జత బట్టలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా, రెండు జతల బట్టలు అందించాలన్నారు. విద్యార్థుల ఆకలి తీర్చే ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సర్వశిక్షా అభియాన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ నాలుగు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు