ఆదిత్యానాథ్ దాస్ ను వెంటనే తప్పించాలి

 ఆదిత్యానాథ్ దాస్ ను వెంటనే తప్పించాలి

ఆదిత్యానాథ్ దాస్ ను తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుండి తొలగించాలని తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఆదిత్యానాథ్ దాస్ నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు . చంద్రబాబు ఆదేశిస్తున్నాడు.. శిష్యుడు రేవంత్ పాటిస్తున్నాడు.ప్రమాణ స్వీకారానికి ముందే తెలంగాణపై చంద్రబాబు కర్రపెత్తనం మొదలయిందనడానికి ఈ నియామకమే నిదర్శనం.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణకు రుణపడి ఉంటాడా? పదవిని లాగేస్తారన్న భయంతో చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటాడా ?.నాడు జలయజ్ఞం ప్రాజెక్టుల నుండి నిన్న పాలమూరు రంగారెడ్డిపై కేసులు వేసి పనులు ఆపిన వ్యవహారంలో ఆదిత్యాదాస్ ది కీలకపాత్ర.ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తికి తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి ఎందుకు కట్టబెట్టారో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి.

తెలంగాణ ప్రాజెక్టుల వ్యతిరేకిగా ముద్రపడ్డ వ్యక్తిని ఏ ప్రయోజనాల కోసం ఈ పదవిలో కూర్చోబెట్టారు ?. వ్యక్తిగతంగా ఒక ప్రభుత్వ అధికారిగా ఆయన పట్ల మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు.కానీ ఆంధ్రకు కృష్ణా ప్రాజెక్టుల నుండి నీటిని తరలించడంలో ఆయనది కీలకపాత్ర.తెలంగాణ ఏర్పడినప్పటి నుండి గత పదేళ్లుగా ఆయన ఏపీ తరపున కొట్లాడిన వ్యక్తి ఆయన తెలంగాణకు న్యాయం చేస్తాడా?.

కేఆర్ఎంబీలో తెలంగాణ వాదనను తొక్కిపట్టి ప్రాజెక్టుల మీద హక్కులు కోల్పోయేలా చేసిన వ్యక్తిని నియమించడం వెనక కాంగ్రెస్ ఆలోచన ఏంటి ?. పోతిరెడ్డిపాడు, దుమ్ముగూడెం, రాయలసీమ ఎత్తిపోతల పథకాలతో తెలంగాణ నీటిని తరలించడంలోనూ ఆదిత్యాదాస్ దే కీలకపాత్ర .. అలాంటి వ్యక్తి తెలంగాణ ప్రయోజనాల కోసం కృషిచేస్తాడా ?.తెలంగాణ ప్రాజెక్టులు, జల వనరుల మీద అపారమైన అనుభవం, అవగాహన ఉన్న ఎందరో జల నిపుణులు ఉన్నారు వారిని పక్కనపెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని ఎంచుకోవడం వెనక కారణాలేంటి ?.

కాంగ్రెస్ పాలనలో పాలమూరు మరోసారి ఎడారి అయ్యేలా ఉంది.ఆదిత్యానాథ్ దాస్ ను తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *