అమరవీరుల ఆశయాలను నెరవేరుస్తా
నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను” అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలి. తెలంగాణ విజయ పతాక దేశ విదేశాలలో సగర్వంగా ఎగరాలి. పల్లె కన్నీరు పెడుతుందో…. అని ఒకనాడు ఆవేదనతో పాడిన తెలంగాణ పల్లెలు ఇకపై పచ్చని పైరులతో, పాడి పంటలతో రైతుల మొఖాలు చిరునవ్వులతో వెలగాలి.
తెలంగాణ ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడుతుందని నిరూపించాలి. మనకు శక్తి, సత్తువ, తెలివి, తెగింపు ఉంది. త్యాగాల చరిత్ర ఉంది. తెలంగాణను ప్రపంచానికి డెస్టినేషన్ గా మార్చాలన్న తపన ఉంది.
అందుకు నాలుగు కోట్ల ప్రజల ఆశీస్సులతో పాటు రాజకీయ, పరిపాలన, పత్రికా, న్యాయ, సామాజిక వ్యవస్థల సహకారం కావాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరు, ప్రతి క్షణం ఆలోచన చేయాలని, ప్రజా ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలని కోరుకుంటూ… తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని అన్నారు.