జూపల్లికి హరీశ్ రావు దిమ్మతిరిగే కౌంటర్..!

Harish Rao Counter To Jupally
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికపై వాడివేడిగా చర్చ జరుగుతుంది. ముందుగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీ ఘోష్ కమిటీ నివేదికను ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నివేదికపై మాట్లాడారు.
ఈ క్రమంలో మాజీ మంత్రి హారీశ్ రావు మాట్లాడుతూ ” తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీని మార్చడం సొంత నిర్ణయం కాదు, క్యాబినెట్ లో చర్చించే అలా చేశామని” ఆయన సభకు తెలిపారు. ‘ నీరు లేని చోట నుంచి ఉన్న చోటుకు బ్యారేజీని మార్చాం. 2009-14 వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా. తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టిని ఎందుకు తీయలేదు?. ప్రజాధనాన్ని అప్పటి మాప్రభుత్వం దుర్వినియోగం చేయలేదు. ఆంధ్రాపాలనలో అన్యాయం జరిగింది కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాం ” అని ఆయన పేర్కొన్నారు.
దీనికి కౌంటరుగా మంత్రి జూపల్లి కృష్ణారావు లేచి మాట్లాడుతూ ” తుమ్మిడిహట్టి, మేడిగడ్డ మధ్య ఏ ఉపనది లేకుండా అదనపు నీళ్లు ఎలా ఉంటాయని ” ఆయన ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ” తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ మధ్య దూరం 116 కిలోమీటర్లు. మహారాష్ట్ర తెలంగాణ లో వాగులున్నాయి. తుమ్మిడిహట్టి దిగువన కలిసే వాగుల ద్వారా 120టీఎంసీల నీళ్లు వస్తాయని” ఆయన కౌంటరిచ్చారు.