దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ..!

దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ… చరిత్రలో నిలవబోతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో దాదాపు 84 శాతం మంది పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందించబోతున్నామని ఆయన చెప్పారు. రేపు ఉగాది రోజున ఆదివారం హుజూర్ నగర్ వేదికగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.
ఏప్రిల్ 1 నుంచి అర్హులందరికీ రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా మరో 30 లక్షల మందిని రేషన్‌కు అర్హులుగా గుర్తించబోతున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఆయన హుజూర్ నగర్ లో జరగనున్న సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించి వచ్చి సచివాలయంలో సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. పేదలకు త్వరలో ఉప్పు, పప్పు, చింతపండు వంటి సరకుల్ని కూడా రేషన్ దుకాణాల ద్వారా అందిస్తామని, క్రమక్రమంగా సరకుల సంఖ్య పెంచుతామని మంత్రి వెల్లడించారు.
“దొడ్డుబియ్యం స్థానంలో సన్నబియ్యం పంపిణీ వల్ల రాష్ట్రంపై రూ.2,800 కోట్ల అదనపు భారం పడనుంది. ఆ భారాన్ని భరించాలని కేంద్రాన్ని కోరా. ప్రతి లబ్ధిదారుకు 6 కిలోల బియ్యం ఇస్తాం. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. అధికారుల వద్ద ఉన్న జాబితాలో పేరుంటే కార్డులేకపోయినా రేషన్ తీసుకోవచ్చు. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇంత మంచి సంక్షేమ పథకాన్ని చూడలేదు అని అన్నారు.